దేశవ్యాప్తంగా ఉన్న 4,982 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల(కెజిబివి)లో 696 అంటే, దాదాపు 15 శాతం విద్యాలయాలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. వీటికి అదనంగా 2022-23 విద్యా సంవత్సరంలో మరో 20 విద్యాలయాలను తెలంగాణకు కేటాయించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సామాజిక వర్గాలకు, మైనారిటీలకు, దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన ఆడ పిల్లలకు మంచి విద్యను అందించాలన్న ఉద్దేశ్యంతో దేశవ్యాప్తంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను ఏర్పాటు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పాఠశాల విద్య ,అక్షరాస్యత విభాగానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ పథకం సమగ్ర శిక్షా అభియాన్ కార్యక్రమంలో భాగంగాన్నారు.
మరింత ఎక్కువమందికి పాఠశాల విద్యను అందుబాటులోకి తీసుకురావడం, బడుగు బలహీన వర్గాలు మరియు అణగారిన వర్గాల పిల్లలను ఒకే చోట చేర్చి వారి మధ్య సమానత్వ భావనను పెంపొందించడం, ప్రాథమిక విద్య నుండి 12 వ తరగతి వరకూ అన్ని స్థాయిల పాఠశాల విద్యలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా సమగ్ర శిక్షా అభియాన్ కార్యక్రమాన్ని పునః రూపకల్పన చేసినట్లు కిషన్ రెడ్డి చెప్పారు.
ఈ పథకం లబ్ధిని నేరుగా విద్యార్థులకు అందించి, వీలయినంత ఎక్కువమందికి పథకాన్ని చేర్చాలని సమగ్ర శిక్షా అభియాన్ సిఫారసు చేస్తోందని ఆయన తెలిపారు. భారత ప్రభుత్వం తరపున దేశవ్యాప్తంగా ఉన్న 4,982 విద్యాలయాలలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తర్వాత అత్యధికంగా 696 విద్యాలయాలు తెలంగాణ రాష్ట్రంలో పిల్లలకు విద్యనందిస్తున్నాయని కేంద్ర మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
2022-23 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా 31విద్యాలయాలను వివిధ రాష్ట్రాలకు కేటాయించగా, వాటిల్లో తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే 20 కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. 2018 నుండి గత నాలుగు సంవత్సరాల కాలంలో 104 నూతన కెజివిబి లను తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం కేటాయించినట్లు ఆయన తెలిపారు.