పశ్చిమబెంగాల్ పరిశ్రమలు, వాణిజ్యశాఖా మంత్రి పార్థా ఛటర్జీని శనివారం ఇడి (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) అరెస్టు చేసింది. ఉపాధ్యా య రిక్రూట్మెంట్ స్కాంతో ముడిపడిన ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఛటర్జీని ఇడి అరెస్టు చేసింది.
శుక్రవారం ఆయనకు ఆప్తురాలుగా భావిస్తున్న అర్పిత ముఖర్జీ ఇంట్లో ఇడి అధికారులు రూ. 20 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును స్వాధీనం చేసుకున్న తర్వాత అధికారులు ఛటర్జీని శుక్రవారం రాత్రి విచారించారు. ఈ విచారణకు ఆయన సహకరించకపోవడంతో మంత్రిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
కాగా, ఈ కుంభకోణం బయటపడినప్పుడు చట్టర్జీ విద్యామంత్రిగా ఉన్నారు. ఇడి అధికారులు స్వాధీనం చేసుకున్న రూ. 20 కోట్ల నగదు ‘ఎస్ఎస్సి’లోని నగదు అని ఇడి అధికారులు అంచనా వేశారు. ఆమె ఇంట్లో మొత్తం 500, 2వేల నోట్ల కట్టలే ఉన్నాయి. ఇరవైకి పైగా మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.
అర్పితతో పాటు విద్యాశాఖ మంత్రి పరేష్ అధికారే, ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్య.. తదితరుల ఇళ్లలో ఈడీ దాడులు కొనసాగాయి. ప్రస్తుతం ఆ ఫొటోలు బయటకు వచ్చాయి.
ఈ కుంభకోణంపై ఇడి కాకుండా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో నగదుకు సంబంధించి ఇడి పరిశీలిస్తుంది. ఇక ఆ రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాలలో గ్రూప్ – సి, డి కేటగిరి ఉపాధ్యాయుల నియామకంలో జరిగిన అవకతవకలపై సిబిఐ దర్యాప్తు చేస్తోంది.