తెలంగాణతో పోలిస్తే ఏపీ ద్రవ్యలోటు తక్కువేనని ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ద్రవ్యలోటు ఎక్కువగా ఉందని వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ మాత్రమే అప్పలు చేస్తున్నట్లు చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణతో పోలిస్తే ఏపీ ద్రవ్యలోటు తక్కువేనని తెలిపారు.
తెలంగాణ ద్రవ్యలోటు 4.13 ఉంటే, ఏపీది 3 శాతం మాత్రమే ఉందని గుర్తు చేశారు. ఎక్కువ శాతం వడ్డీకి రుణాలు తీసుకుంటున్నామని చేస్తున్న ఆరోపణలను మంత్రి ఖండించారు. 2014-15లో ఏపీ ద్రవ్యలోటు రూ.20,745 వేల కోట్లుగా ఉంటే, 2021-22 నాటికి రూ.25,195 కోట్లకు చేరిందని తెలిపారు.
ఎవరిని భయపెట్టాలని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. ద్రవ్యలోటు విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ పరిస్థితి మెరుగ్గానే ఉందని బుగ్గన స్పష్టం చేశారు.తెలుగుదేశం పార్టీ హయాంలో కంటే తక్కువ అప్పులే చేశామని చెప్పారు. ఎంతో నిబద్దతతో తాము పాలన కొనసాగిస్తున్నామని పేర్కొంటూ 2014-19 మధ్య కాలంలో టీడీపీ బాధ్యత లేకుండా వ్యవహరించిందని విమర్శించారు. 2019 తర్వాత చేసిన అప్పులు టీడీపీ చేసిన అప్పుల కంటే చాలా తక్కువ అని పేర్కొన్నారు.
‘మా ప్రభుత్వ హయాంలో అప్పులు చేశాము. అయితే టీడీపీ ప్రభుత్వ హాయంతో పోల్చితే మేము చేసిన అప్పుల శాతం చాలా తక్కువ. కర్ణాటకలో సగటున ఏడాదికి అప్పుల భారం రూ. 60 వేల కోట్లు, తమిళనాడులో రూ.1 లక్ష కోట్ల అప్పు పెరిగింది. జనాభా దామాషా ప్రకారం చూసినా, మరే విధంగా చూసినా ఏపీ అప్పుల తీరు చాలా తక్కువ’ అని ఆర్ధిక మంత్రి స్పష్టం చేశారు. “స్థూల ఉత్పత్తిలో పోల్చితే ఈ అప్పులు ఏ విధంగా ఎక్కువ? నిజానికి మా హయాంలో చేసిన అప్పులు స్థూల ఉత్పత్తితో పోల్చితే తక్కువే. ఏడాదికి 15%-16% వరకు అప్పు పెరిగితే, మిగతా రాష్ట్రాల్లో 20% వరకు పెరిగింది” అని వివరించారు.
మూడు నెలల్లోనే సగంకు పైగా ఋణం
మరోవంక, ఏపి ప్రభుత్వం చేస్తున్న అప్పుల చిట్టాను మరోసారి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా వివరాలు పేర్కొంది. అప్పు పుట్టిన ప్రతి చోటా రాష్ట్ర ప్రభుత్వం రుణాలు తీసుకుంటోందని కేంద్రం వ్యాఖ్యానించింది. ఈ మేరకు మంగళవారం రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి అనుమతించిన రుణాల్లో సగానికి పైగా రుణాలను రాష్ట్ర ప్రభుత్వం తొలి 3 నెలల్లోనే సేకరించిందని ఆయన వెల్లడించారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి నికర రుణ పరిమితి కింద ఏపీకి రూ.44,574 కోట్ల రుణాలకు కేంద్రం అనుమతించిందని మంత్రి వివరించారు.
ఇందులో మొదటి 9 నెలలకు గాను రూ.40,803 కోట్ల రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఉందని తెలిపారు. తొలి 3 నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం 50 శాతానికి మించి అప్పులు తీసుకుందన్నారు. అందులో ఏప్రిల్ నెల పూర్తయ్యేనాటికే… అంటే ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తొలి నెలలోనే రూ.21,890 కోట్ల రుణాన్ని తీసుకుందని మంత్రి తెలిపారు.