ఉపాధ్యాయుల కుంభకోణంలో ఈడీ అరెస్ట్ నేపథ్యంలో పార్థా ఛటర్జీని ఎట్టకేలకు మంత్రి పదవి నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉద్వాసన పలికారు. పార్థా ఛటర్జీపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను పదవి నుంచి తప్పించాలని బెంగాల్ వ్యాప్తంగా డిమాండ్ వినిపించింది.
ఈ నేపథ్యంలో ప్రత్యేక కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన దీదీ పార్థా ఛటర్జీని మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బెంగాల్ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. పార్థా ఛటర్జీ మమతా ప్రభుత్వంలో పరిశ్రమలు, వాణిజ్యం, ఎంటర్ప్రైజెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా ఉన్నారు.
‘పార్థా ఛటర్జీని మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నా. తప్పు చేసినవారిపై టీఎంసీ కఠిన చర్యలు తీసుకుంటుంది. అధికారాన్ని దుర్వినియోగం చేసేవారి పని పట్టడానికి మా వద్ద చాలా ప్లాన్స్ ఉంటాయి.. అవన్నీ చెప్పలేం’ అని మమత పేర్కొన్నారు.
పార్థాను మంత్రి పదవి నుంచి తప్పించడంతో అతని శాఖను మమతా బెనర్జీయే చూసుకోనున్నారు. ఆయనను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రధాన కార్యదర్శి పదవి నుండి కూడా తప్పించారు. పార్థా ఛటర్జీ సన్నిహితురాలు సినీ నటి అర్పిత ఇంట్లో ఈడీ అధికారులు మరోసారి సోదాలు నిర్వహించారు.
ఇప్పటికే ఆమె ఇంట్లో రూ. 29 కోట్లు పట్టుబడగా..తాజాగా రెండో ఫ్లాట్ లో మరో రూ. 21 కోట్లు దొరికాయి. ఈ సోదాల్లో నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా కనిపించడం సంచలనంగా మారింది. కేజీల కొద్దీ బంగారం, విలువైన డాక్యుమెంట్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో మొత్తం రూ. 50 కోట్లకుపైగా నగదును ఈడీ సీజ్ చేయడం గమనార్హం.
సోదాల్లో దొరికిన డబ్బును అధికారులు పెద్ద పెద్ద బాక్సుల్లో తరలించారు.దొరికిపోయిన ఆ డబ్బంతా పార్థ ఛటర్జీదేనని ఈడీ అధికారులకు అర్పిత ముఖర్జీ వాంగ్మూలం ఇచ్చింది. నగదును దాచుకునేందుకు పార్థా ఛటర్జీ తన ఫ్లాట్ ను వాడుకునే వారని ఆమె అధికారులకు తెలియజేసింది.
ఈ కేసులో వీరిద్దరితో పాటు.. టీఎంసీ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్యను కూడా ఈడీ విచారిస్తోంది. ఉపాధ్యాయ నియామకాల కుంభకోణంలో జులై 23న అరెస్ట్ అయిన పార్థ ఛటర్జీ, సినీనటి అర్పిత ముఖర్జీ ఆగస్టు 3 వరకు రిమాండ్‌లో ఉండనున్నారు.
మరోవంక, కుంభకోణంకు సంబంధించి తన ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలలో దోరికిన నగదు మొత్తం ఆ మంత్రికి చెందినవే అని ఇదే కేసులో అరెస్ట్ ఆయన ఆయన సన్నిహితురాలు, నటి అర్పితా ముఖర్జీ ఈడీ విచారణలో వెల్లడించారు. ఆమెకే చెందిన మరో ఇంట్లో మరింత నగదును స్వాధీనం చేసుకుంది. నగదుతో పాటు మరిన్ని ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది.ఈడీ అధికారుల సమాచారం ప్రకారం, అర్పితా ముఖర్జీ పూర్తిగా అధికారులకు సహకరిస్తోంది.
అయితే, బెంగాల్ మాజీ విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీ మాత్రం దర్యాప్తునకు ఏమాత్రం సహకరించడం లేదు. ”ఛటర్జీని ప్రశ్నించి వివరాలు రాబట్టడం చాలా కష్టంగా ఉంది. చాలా మొండిగా వ్యవహరిస్తున్నారు. అధికారులకు ఏమాత్రం సహకరించడం లేదు. మా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదు” అని ఈడీ అధికారి ఒకరు చెప్పారు.
ఓ బెంగాలీ నటుడు తనను మంత్రికి పరిచయం చేశారని, 2016 నుండి ఆయనతో పరిచయం ఉన్నదని ఆమె చెప్పిన్నట్లు తెలిసింది. పైగా, పార్ధా తన ఇంట్లో ఉన్న ఓ రూమ్‌లోనే డబ్బును దాచాడని పేర్కొంది. తన ఇంటితో పాటు మరో మహిళ ఇంటిని కూడా ఆయన మినీ బ్యాంక్‌లా వాడుకున్నట్లు ఆరోపించారు. తన ఇంట్లోని రూమ్‌కు ఫుల్ సెక్యూర్టీగా పార్థా మనుషులే ఉండేవారని చెప్పింది. వారు మాత్రమే రూమ్ లోపలి వెళ్లి వచ్చేవారని స్పష్టం చేసింది.
కాగా, తన ఇంటికి పార్థా ఛటర్టీ.. వారంలో ఒక్కరోజు లేదా 10 రోజులకు ఒకసారి వచ్చి వెళ్లే వారని తెలిపారు. వచ్చిన తర్వాత రూమ్‌లోకి వెళ్లి డబ్బులు చెక్ చేసుకునే వారిని వెల్లడించింది. అయితే, ఆ డబ్బంతా.. కాలేజీల విషయంలోనే లంచాల రూపంలో వచ్చిందని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. వీరిద్దరూ ఆగస్టు 3వ తేదీ వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు. దీంతో విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.