శివసేన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ను ఈడీ ఆదివారం అదుపులోకి తీసుకుంది. ఆయనను విచారణ నిమిత్తం ఈడీ కార్యాలయానికి తరలించింది. ఈవిషయం తెలియడంతో శివసేన కార్యకర్తలు పెద్దసంఖ్యలో సంజయ్ రౌత్ ఇంటివద్దకు చేరుకొని ఈడీకి, కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ముంబైలోని పత్రా చాల్ భూ కుంభకోణం కేసులో సంజయ్ రౌత్ తో పాటు ఆయన భార్య, అనుచరుల లావాదేవీలకు సంబంధించి మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని రెండుసార్లు ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే పార్లమెంటు సమావేశాలు ఉన్నందున ఆగస్టు 7 తర్వాతే విచారణకు వస్తానని రౌత్ స్పష్టం చేశారు.
దీంతో స్వయంగా ఈడీ అధికారులే ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రౌత్ ఇంట్లో సోదాలు చేశారు. సోదాల అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం క్రింద ఈడీ ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేసింది. సోదాల్లో రూ.11.50 లక్షల నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు సంజయ్ రౌత్ సతీమణి వర్ష రౌత్‌కు, ఆయన ఇద్దరు సన్నిహితులకు చెందిన దాదాపు రూ.11.15 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ గత ఏప్రిల్‌లో జప్తు చేసింది. దాదర్ ప్రాంతంలోని వర్ష రౌత్‌కు చెందిన ఓ ఫ్లాట్, ఆమెకు, స్వప్న పట్కర్‌కు ఉమ్మడిగా అలీబాగ్‌లోని కిహిం బీచ్ వద్ద ఉన్న ఎనిమిది స్థలాలను జప్తు చేసింది.
సంజయ్ రౌత్‌కు అత్యంత సన్నిహితుడైన సుజిత్ పట్కర్ భార్య స్వప్న పట్కర్. ప్రవీణ్ రౌత్, సుజిత్ పట్కర్‌లతోగల సన్నిహిత వ్యాపార, ఇతర అనుబంధం గురించి సంజయ్ రౌత్‌ను ప్రశ్నించాలని ఈడీ భావిస్తోంది. సంజయ్‌కు ప్రవీణ్, సుజిత్ అత్యంత సన్నిహితులు.
సంజయ్ సతీమణి వర్ష ఆస్తి లావాదేవీల గురించి కూడా ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. గురుగ్రామ్ ప్రాంతంలోని పట్రా చావల్ రీ-డెవలప్మెంట్కు సంబంధించిన రూ.1,034 కోట్ల విలువైన భూ కుంభకోణం కేసులో ప్రవీణ్ రౌత్‌ను అరెస్టు చేసింది. ఆయన ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.