జీఎస్టీ వసూళ్లు మరోసారి రికార్డు సృష్టించాయి. 2022, జులై నెలలో అత్యధికంగా లక్షా 48వేల 995 కోట్ల రూపాయల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఏడాది పరంగా 28 శాతం పురోగతి జులై ఆదాయం ఏకంగా రూ.1.49 లక్షల కోట్లుగా నమోదయ్యింది. జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చాక ఇది రెండవ గరిష్ఠ ఆదాయం కావడం విశేషం.
దీంతో వరుసగా 5వ నెలలో కూడా జీఎస్టీ ఆదాయం రూ.1.4 లక్షల కోట్ల మార్క్ దాటినట్టయ్యిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది. గతేడాది జులైలో వసూలైన జీఎస్టీ ట్యాక్స్ కన్నా ఈ సారి 28% శాతం అధికంగా రాబడి వచ్చిందని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో సీజీఎస్టీ 25వేల 751 కోట్లు, ఎస్ జీఎస్టీ 32వేల 807 కోట్లు, ఐజీఎస్టీ 79వేల 518 కోట్లు, సెస్ రూపంలో 10వేల 920 కోట్లు వసూలయ్యాయని తెలిపింది. జులై వరకు జీఎస్టీ ఆదాయం ఏడాదిపరంగా 35 శాతం వరకూ పెరిగింది.
పన్ను చెల్లింపులను మరింత సులభతరం చేస్తూ జీఎస్టీ కౌన్సిల్ గతంలో తీసుకున్న పలు చర్యలు ఇందుకు దోహదపడ్డాయని ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు ఆర్థిక వ్యవస్థ రికవరీ కూడా జీఎస్టీ వసూళ్లపై సానుకూల ప్రభావం చూపిందని వెల్లడించింది. జూన్ నెలలో 74.5 మిలియన్ల ఈ-వే బిల్లులు జనరేట్ అయ్యాయని ఆర్థిక శాఖ పేర్కొంది.
మే నెలలో నమోదయ్యిన 73.6 మిలియన్ల బిల్లుల కంటే జూన్ నెల బిల్లులు కాస్తంత ఎక్కువగా ఉన్నాయని డేటా స్పష్టం చేసింది. గతేడాది జులై నెలతో పోల్చితే ఈ ఏడాది జీఎస్టీ వసూళ్లలో 28శాతం వృద్ధి నమోదైందని ఈ సందర్భంగా కేంద్రం ప్రకటించింది.
జులై నెలలో తెలంగాణ నుంచి 4వేల 547 కోట్ల జీఎస్టీ వసూలు కాగా, గతేడాది ఏప్రిల్ నెలతో పోల్చితే ఇదే అధికమని తెలిపింది.
జులై 2021లో వస్తు, సేవల పన్ను వసూళ్లు రూ. 1,16,393 కోట్లుగా ఉన్నాయి. అయితే జులై 2017లో జీఎస్టీని ప్రవేశపెట్టిన నుంచి చూసుకుంటే ఈ ఏడాది జులైలో నమోదైన వసూళ్లు రెండో అత్యధికమైన వసూళ్లుగా మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.