చైనా బెదిరింపులను ఖాతరు చేయకుండా, తీవ్ర ఉద్రిక్తతల నడుమ తైవాన్‌లో అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ అడుగుపెట్టారు. తైపీ ఎయిర్‌పోర్ట్‌లో భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి దిగిన ఆమెకు సాదర స్వాగతలం లభించింది. అయితే దిగీదిగంగానే ఆమె చేసిన ట్వీట్లు చైనాను రెచ్చగొట్టేలా ఉన్నాయి.
అమెరికా ముందు నుంచి చెప్తున్నట్లు తైవాన్ ప్రజాస్వామ్యానికి మద్దతుగా, అలాగే ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛకు మేం కట్టుబడి ఉంటామని ఆమె ట్వీట్లు చేశారు. మరోవైపు నాన్సీ పెలోసీ ల్యాండ్ అయిన విషయం తెలుసుకున్న చైనా.. జరగబోయే పరిణామాలన్నింటికి అమెరికానే కారణమంటూ ప్రకటించింది.
చైనా తన భూభాగంగా చెబుతున్న తైవాన్‌లో దాదాపు 25 ఏళ్ల తర్వాత అమెరికా అత్యున్నత స్థాయి నేత అడుగుపెట్టడం ఇదే కావడంతో అమెరికా – చైనా మధ్య కొన్ని రోజులుగా మాటల యుద్ధం జరుగుతున్నాయి. రెండు దేశాలు తమ సేనలను మోహరిస్తున్నాయి. దానితో చైనా-తైవాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది.
చైనా తీవ్ర అభ్యంతరాలు, హెచ్చరికల నడుమే తైవాన్‌లో ఆమె అడుగుపెట్టారు. మొదటి నుంచి ఆమె పర్యటనను వ్యతిరేకిస్తున్న చైనా.. తాజాగా తైవాన్ భూ భాగంలోకి ఫైటర్ జెట్స్‌ను ప్రయోగించింది. అంతేకాదు తైవాన్ ప్రభుత్వ వెబ్సైట్లను సైతం హ్యాక్ చేసింది.
తైవాన్-చైనా ఉద్రిక్తతల నడుమ యుద్ధ వాతావరణం నెలకొనడంతో మూడో ప్రపంచ యుద్ధం అంటూ ట్విటర్ ట్రెండ్ నడుస్తోంది. స్వీయ పరిపాలన ఉన్న తైవాన్ను తమ సొంతంగా ప్రకటించుకుంది చైనా. అలాగే.. పెలోసీ పర్యటన తమ (చైనా) తైవాన్ పర్యటన.. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని, చైనా ఆర్మీ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించింది.
డ్రాగన్ హెచ్చరికలతో అప్రమత్తమైన అమెరికా నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటనకు ముందే నాలుగు యుద్ధ నౌకలను తైపీ సమీపంలోని సముద్ర జలాల్లో మోహరించింది. అందులో యుద్ధ విమానాలను మోసుకెళ్లే నౌక సైతం ఉంది. ఈ పరిణామాలతో తైవాన్ కూడా అప్రమత్తమైంది. చైనాతో యుద్ధానికి సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో ఆ దేశ మిలిటరీని హై అలర్ట్ చేసిందని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. కొంతమంది అధికారులు, సైనికులకు సెలవులు కూడా రద్దు చేసినట్టు పేర్కొన్నాయి. తక్షణమే యుద్ధానికి సిద్ధమవ్వాలంటూ గగనతల రక్షణ దళాలకు ఆదేశాలు అందినట్టు తైవాన్ న్యూస్ సంస్థల రిపోర్టులు పేర్కొన్నాయి.