పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తమ మంత్రివర్గాన్ని బుధవారం భారీ స్థాయిలో ప్రక్షాళించారు. కొత్తగా తొమ్మండుగురికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. వారిలో నరేంద్ర మోదీ మంత్రివర్గంలో పనిచేసిన బాబుల్ సుప్రియోకు చోటు కల్పించారు. ఆయన గత ఏడాదే బీజేపీ నుంచి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు.
రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిగా ఉన్న పార్థా ఛటర్జీ అంతకు ముందు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన టీచర్ల రిక్రూట్మెంట్ స్కామ్ టిఎంసిలో దుమారం రేపింది. పార్థాను బర్తరఫ్ చేశారు. తదుపరి తక్షణ ఆపరేషన్‌గా మమత బెనర్జీ మంత్రివర్గంలో భారీ స్థాయిలో మార్పులు చేర్పులు చేపట్టారు. బుధవారం ఉదయం కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు.
బాబుల్ సుప్రియో, స్నేహాషిష్ చక్రవర్తి, పార్థా భౌమిక్, ఉదయన్ గుహ, ప్రదీప్ మజుందార్, బిర్భా హన్స్డా, బిప్లబ్ రాయ్, తజ్ముల్ హోస్సెయిన్, సత్యజిత్బర్మన్ మంత్రులు అయ్యారు. రాజ్‌భవన్‌లో ఈ కొత్త మంత్రులతో గవర్నర్ ఎల్ గణేశన్ ప్రమాణం చేయించారు. మంత్రులు అయిన వారిలో ఉదయన్ గుహా ఫార్వర్డ్ బ్లాక్నేతగా ఉంటూ 2016లో టిఎంసిలో చేరారు.
చక్రవర్తి పార్టీ టిఎంసి అధికార ప్రతినిధి. హౌరా జిల్లా టిఎంసి విభాగం నిర్వాహకులు. పార్థా భౌమిక్ నైహతి అసెంబ్లీ సీటు నుంచి మూడు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గిరిజన నాయకులు బిర్భా హన్స్డా, రాయ్ చౌదరి సహాయ మంత్రులుగా స్వతంత్ర బాధ్యతలు నిర్వహిస్తారు.
మంత్రివర్గం లో ఇంతకు ముందటి ఖాళీలు, ఇప్పుడు పార్థా జైలుకు వెళ్లడం వంటి అంశాలతో తాను అదనపు బాధ్యతలు నిర్వర్తించడం కష్టం అవుతుందని, అందుకే మంత్రివర్గ పునర్వస్థీకరణ జరిగినట్లు సిఎం వివరించారు. సోమవారమే మమత బెనర్జీ టిఎంసి అధినేత్రి హోదాలో పార్టీలో భారీ స్థాయి మార్పులకు దిగారు.
35 వ్యవస్థాగత జిల్లాలకు సంబంధించి 16 జిల్లాల పార్టీ అధ్యక్షులను మార్చారు. పనిచేయని వారిపై వేటేశామని, ఇతరులను పార్టీ బాధ్యతల నుంచి తప్పించామని మమత వివరించారు. 2021లో బెంగాల్లో టిఎంసి మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కేబినెట్ పునర్వస్థీకరణ జరగడం ఇదే తొలిసారి.
ఎవరిపై అవినీతి ఆరోపణలు వచ్చినా తాను సహించేది లేదని, చట్ట ప్రకారం అన్ని చర్యలు జరగాల్సిందేనని పార్థా అరెస్టు వెంటనే మమత స్పష్టం చేశారు. టీచర్ల స్కాంకు సంబంధించి ఇడి సోదాలు నిర్వహించడం, ఈ క్రమంలో పార్థా ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీకి చెందిన ఫ్లాట్లలో దాదాపు రూ 50 కోట్లు, నగలు స్వాధీనం చేసుకోవడం వంటి పరిణామాలతో మమత తీవ్రస్థాయిలో చర్యలకు దిగారు.
భారీ స్కామ్ సిఎం మమతకు తెలియకుండా జరగదని, ఇన్ని కోట్ల రూపాయల వ్యవహారంలో ఆమె పాత్ర ఉందని, తన తప్పులు వెలుగులోకి రాకుండా ఉండేందుకే ఇప్పుడు మమత ఈ విధంగా స్పందిస్తున్నారని బిజెపి విమర్శించింది.