జైలు పాలైన వ్యక్తి ఆధ్వర్యంలో తాను కలిసి పనిచేయలేనని కాంగ్రెస్ ఎంఎల్ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపిణి రాజీనామా లేఖలో స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని కొందరు నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తుతూ ఎంఎల్ఎలను గెలిపించలేని వ్యక్తులు, గెలిచిన ఎంఎల్‌ఎలలో మనోధైర్యం నింపలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు.
అనేక పార్టీలు మారి స్వలాభం కోసం ఓ ప్రజాప్రతినిధి చేయకూడని పనులు చేశారని అంటూ పరోక్షంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కారణంగా పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. మీపైనే వ్యక్తిగత విమర్శలు చేసిన వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించారని, ఇది తనను తీవ్రంగా బాధించిందని అంటూ ఆమె సోనియా వ్యవహారంపై సహితం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి విధేయులైన వారిని అడుగడుగునా అవమానపరుస్తున్నారని స్పష్టం చేశారు.
మీ నాయకత్వంలో ఏ పని అప్పగించినా రాజీ లేకుండా కష్టపడ్డానని ఈ సందర్భంగా ఆమెకు గుర్తుచేశారు. కన్నీళ్లు, కష్టాలు దిగమింగుకుంటూ పార్టీలో పనిచేశానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచిన ఎంఎల్ఎ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాని, దీనిని తక్షణం ఆమోదించాలని రాజగోపాల్ రెడ్డి కోరారు.
మునుగోడు ఎంఎల్ఎ పదవికి, కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించిన రాజగోపాల్ రెడ్డి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని త్వరలోనే కలిసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా పత్రాన్ని కూడా అందిస్తానని కూడా మంగళవారం నాడు ప్రకటించారు. కొన్ని రోజులుగా నియోజకవర్గంలో ముఖ్య నేతలతో రాజగోపాల్ రెడ్డి సమావేశాలు నిర్వహిస్తున్నారు.
మరోవైపు మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగితే తమ పట్టును నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ తరుణంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైపునకు పార్టీ కార్యకర్తలు వెళ్లకుండా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం చర్యలు ప్రారంభించింది.