ఇంగ్లండ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో ముగిశాయి. ఈ క్రీడల్లో భారత్ రికార్డు స్థాయిలో 61 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. భారత్ 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు సాధించింది. మొత్తం 12 పతకాలతో భారత రెజ్లర్లు మెరిశారు. రెజ్లింగ్ లో భారత్ కు 6 స్వర్ణాలు, ఒక రజతం, 5 కాంస్యాల పతకాలు లభించాయి. భారత వెయిట్ లిఫ్టర్లు మొత్తంగా 10 పతకాలు సాధించారు. అందులో 3 పసిడి, 3 రజతం, 4 కాంస్యాలున్నాయి. టేబుల్ టెన్నిస్ లో భారత్ కు 4 స్వర్ణాలు సహా 7 పతకాలు వచ్చాయి.
బాక్సింగ్ లో 3 స్వర్ణాలు, ఒక రజతం, 3 కాంస్యాలు వచ్చాయి. బ్యాడ్మింటన్ లో 3 స్వర్ణాలు సహా 6 పతకాలు సాధించింది భారత్. షట్లర్ల ఖాతాలో 3 స్వర్ణాలు, ఒక రజతం, 2 కాంస్యా పతకాలు ఉన్నాయి. అథ్లెంటిక్స్ విభాగంలో భారత్ కు మొత్తం 8 పతకాలు వచ్చాయి.
ఒక స్వర్ణంతో పాటు 4 రజతాలు, 3 కాంస్యాలు నెగ్గిన భారత్ అథ్లెట్లు. లాన్స్ బౌల్స్ క్రీడల్లో భారత్ కు ఒక స్వర్ణం, ఒక రజతం వచ్చాయి. పారా పవర్ లిఫ్టింగ్ లో భారత్ ఖాతాలో ఒక స్వర్ణం చేరింది. జూడోలో భారత్ కు 2 రజతాలు, ఒక కాంస్యం సహా మొత్తం 3 పతకాలు వచ్చాయి.
హాకీలో ఒక రజతం, ఒక కాంస్యం సహా భారత్ 2 పతకాలు నెగ్గింది. తొలిసారిగి ప్రవేశపెట్టిన క్రికెట్ లో భారత మహిళలకు రజత పతకం లభించింది. స్వ్యాష్ లో భారత ఖాతాలో రెండు కాంస్య పతకాలు చేరాయి. ఆఖరిరోజు భారత్‌కు నాలుగు స్వర్ణ, ఒక్కో రజత, కాంస్య పతకాలు దక్కాయి. బ్యాడ్మింటన్‌లో మూడు, టేబుల్ టెన్నిస్(టిటి)లో ఒక స్వర్ణ పతకం లభించగా.. పురుషుల హాకీ జట్టు ఫైనల్లో ఓడి రజత పతకానికే పరిమితం అయ్యారు.
బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో పివి సింధు 21-15, 21-13తో మిఛ్చెలె లీ(కెనడా)పై వరుససెట్లలో గెలుపొందింది. దీంతో కామన్వెల్త్ క్రీడల్లో సింధు తొలిసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అంతకుముందు 2014లో కాంస్యం, 2018లో రజత పతకాలు సాధించిన సింధు.. ఈసారి ఏకంగా స్వర్ణ పతకాన్నే ముద్దాడింది.
సింధు సాధించిన స్వర్ణ పతకంతో భారత్‌కు కామన్వెల్త్ క్రీడల్లో 200 స్వర్ణ పతకాలు దక్కినట్లైంది. ఇక పురుషుల సింగిల్స్ ఫైనల్లో యువ షట్లర్ లక్ష్యసేన్ 19-21, 21-9, 21-16తో ఎన్జి టి యంగ్(మలేషియా)పై చెమటోడ్చి నెగ్గాడు. తొలి గేమ్‌ను చేజార్చుకున్న లక్ష్యసేన్.. రెండోగేమ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు.
మూడో గేమ్‌లో లక్ష్యసేన్ అర్ధభాగానికి 11-9తో ఉన్నా క్రమంలో పుంజుకొని 21-16తో ముగించాడు. దీంతో 2014లో పారుపల్లి కశ్యప్ తర్వాత 8ఏళ్లకు బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో మరో స్వర్ణాన్ని లక్ష్యసేన్ సంపాదించిపెట్టాడు.
పురుషుల డబుల్స్ ఫైనల్లో రంకిరెడ్డి-చిరాగ్‌శెట్టి జోడీ 21-15, 21-13తో ఇంగ్లండ్ జోడీని వరుససెట్లలో ఓడించి బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో భారత్ కామన్వెల్త్ బ్యాడ్మింటన్ విభాగంలో 3స్వర్ణ, ఒక రజత, మరో రెండు కాంస్య పతకాలను సాధించినట్లైంది.
టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో 40ఏళ్ల ఆచంట శరత్ కమల్ స్వర్ణ పతకాన్ని గెలిచాడు. ఫైనల్లో శరత్ 4-1(11-13, 11-7, 11-2, 11-6, 11-9)తో ఇంగ్లండ్‌కు చెందిన లిమ్ పిచ్ఫోర్డ్ను చిత్తుచేశాడు. 4వ సీడ్‌గా బరిలోకి దిగిన శరత్ కమల్ తొలి సెట్‌ను చేజార్చుకున్నా.. ఆ తర్వాత వరుసగా నాలుగు గేమ్‌లను సొంతం చేసుకొని మ్యాచ్‌ను ముగించాడు. దీంతో 2006తర్వాత కామన్వెల్త్ క్రీడల్లో శరత్ కమల్ మరో మారు బంగారు పతకాన్ని సాధించినట్లైంది.