రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో అనేక హామీలను గుప్పించి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో విఫలమైతే, ఆ పార్టీల గుర్తింపును రద్దు చేయడం తగదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు.
ఈ కారణంతో గుర్తింపును రద్దు చేయాలనడం ప్రజాస్వామ్య వ్యతిరేకమని చెప్పారు. శాసన వ్యవస్థ కార్యకలాపాల్లో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటోందనే అపవాదు ఇప్పటికే ఉందని పేర్కొన్నారు.
రాజకీయ పార్టీలు ఇష్టానుసారం ఉచిత పథకాలను ప్రకటిస్తున్నాయని, అధికారం చేపట్టిన తర్వాత వాటిని అమలు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ నేపథ్యంలో సమగ్ర మార్గదర్శకాలను జారీ చేయాలని కోరుతూ ప్రముఖ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
ఉచిత పథకాల హామీలపై పూర్తి వివరాలను సమర్పించాలని రాజకీయ పార్టీలను ఆదేశించింది. ఈ సమాచారం పూర్తిగా వచ్చిన తర్వాత, ఎంత వరకు జోక్యం చేసుకోచ్చునో పరిశీలిస్తామని చెప్పింది. తదుపరి విచారణ ఈ నెల 17న జరుగుతుందని తెలిపింది.
రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలను క్రమబద్ధీకరించేందుకు, వాటిలో ఇచ్చిన వాగ్దానాలకు ఆయా పార్టీలను జవాబుదారీ చేసేందుకు ఆదేశాలు జారీ చేయాలని అశ్విని కుమార్ ఉపాధ్యాయ తన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)లో కోరారు. ప్రజా సంక్షేమాన్ని ఉచిత పథకాలను ఒకే గాటన కట్టకూడదని వాదించారు.
దీనిపై సీజేఐ స్పందిస్తూ, ఈ నెల 17న జరిగే తదుపరి విచారణలో అన్ని విషయాలను మాట్లాడవచ్చునని చెప్పారు. తనకు ఎదురైన కొన్ని సంఘటనలను ఉదాహరణగా చూపిస్తూ రాజకీయ పార్టీలు, ప్రభుత్వాల తీరును వివరించారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తూ, రాజకీయ పార్టీలు ఉచిత పథకాలపై ఇచ్చే హామీలను క్రమబద్ధీకరించవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ముందడుగు వేయవచ్చునని చెప్పారు. పార్లమెంటు ఓ చట్టాన్ని రూపొందించే వరకు అమలయ్యే విధంగా మార్గదర్శకాలను జారీ చేయవచ్చునని తెలిపారు.
ఎన్నికల్లో తాయిలాల హామీలను నియంత్రించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. లబ్ధిదారులు, ఉచిత పథకాలకు మద్దతిచ్చే వారు, పారిశ్రామిక, ఒత్తిళ్ళను ఎదుర్కొంటున్న రంగాలు, జాతీయ పన్ను చెల్లింపుదారుల సంఘాల ప్రతినిధులు; కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యదర్శులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, నీతీ ఆయోగ్, ఆర్థిక సంఘం, ఆర్బీఐ ప్రతినిధులతో ఈ కమిటీని ఏర్పాటు చేయవచ్చునని ప్రతిపాదించారు.
సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ మాట్లాడుతూ, ఇది చాలా సంక్లిష్టమైన అంశమని, కచ్చితమైన సమాచారం ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకోగలుగుతామని చెప్పారు. తన వద్ద పని చేసే ఓ ఉద్యోగిని వద్ద నిన్న డబ్బులు లేవని, తాను ఆమెకు డబ్బులు ఇచ్చానని చెప్పారు. అయితే ఆమె తాను ఉచిత బస్సులో ప్రయాణం చేస్తానని చెప్పారని తెలిపారు. మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు ఆ బస్సు అవకాశం కల్పిస్తుందని చెబుతూ ఇది ఉచిత తాయిలాల పథకం ఎలా అవుతుందని ప్రశ్నించారు.
జస్టిస్ రమణ స్పందిస్తూ, ‘‘మా మామగారు వ్యవసాయదారుడు. వ్యవసాయదారులు లేదా భూమి యజమానులకు (ఉచిత) విద్యుత్తు కనెక్షన్ సదుపాయం ఉండదని ప్రభుత్వం చెప్పింది. రిట్ పిటిషన్ వెయ్యగలవా? అని ఆయన నన్ను అడిగారు. అది విధాన నిర్ణయమని నేను ఆయనకు చెప్పాను” అని తెలిపారు.
“ఓరోజు అక్రమ కనెక్షన్‌ను క్రమబద్ధీకరించారు, ఆయనకు లేదు. శాంక్షన్ ప్లాన్‌కు ఉల్లంఘన అవుతుందని నేను నా ఇంట్లో ఓ ఇటుకను అయినా ముట్టుకోను, ఇతర బంగళాల్లో అంతస్థుల మీద అంతస్థులు నిర్మిస్తున్నారు. ఆ మర్నాడే వాటిని క్రమబద్ధీకరిస్తున్నారు. కాబట్టి తప్పులు చేసే వారికి ఆమోదం లభిస్తోంది, చట్టానికి కట్టుబడి ఉండేవారికి శిక్ష పడుతోంది’’ అని చెప్పారు.
చట్టవిరుద్ధమైన వాటిని చట్టబద్ధం చేయడానికి ఉచిత పథకాలు దారి తీస్తున్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఖజానాకు జరిగే నష్టం, ప్రజా సంక్షేమం మధ్య సంతులనాన్ని పాటించాలని సూచించారు. అందుకే ఈ చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. తమ దార్శనికత, ఆలోచనలను వినియోగించేవారు ఎవరో ఒకరు ఉండాలని చెప్పారు. తాను పదవీ విరమణ చేసే లోగా ఏదో ఒకటి చెప్పాలని కోరారు.