పోలీసు తుపాకిని తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారు తెలంగాణ అబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ దాంతో ఆయన వివాదంలో చిక్కుకున్నారు. పోలీసుల చేతుల్లోని ఎస్ఎల్ఆర్ తుపాకీని తన చేతుల్లోకి తీసుకున్న ఆయన జనమంతా చూస్తుండగానే గాల్లోకి కాల్పులు జరిపారు.
పోలీసు తుపాకీని తన చేతుల్లోకి తీసుకున్న మంత్రి గాల్లోకి కాల్పులు జరుపుతున్న సమయంలో పోలీసు ఉన్నతాధికారులు అక్కడే ఉన్నా ఆయనను వారించకపోవడం గమనార్హం. పోలీసు తుపాకీతో కాల్పులు జరపడంతోనే ఆగిపోని శ్రీనివాస్ గౌడ్ ఆ ఫొటోలను ఎంచక్కా తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.
ఈ ఫొటోలు, వీడియోలను చూసిన నెటిజన్లు పోలీసుల తుపాకీతో మంత్రి గాల్లోకి ఎలా కాల్పులు జరుపుతారంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల పేరిట తెలంగాణ సర్కారు కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీడమ్ ర్యాలీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తన సొంత జిల్లా మహబూబ్ నగర్ లో జరిగిన ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి హోదాలో శ్రీనివాస్ గౌడ్ పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగానే ఆయన పోలీసు తుపాకీని తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారు.
గౌడ్ ను బర్తరఫ్ చేయాలి
బహిరంగంగా గాల్లో కాల్పులు జరిపిన రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను వెంటనే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను డిమాండ్ చేసారు. శనివారం తిరంగా ర్యాలీలో మంత్రి గాల్లో కాల్పులు జరిపిన విషయంపై ఆమె దిగ్బంతి వ్యక్తం చేశారు. అసలు తెలంగాణ లో పోలీసు వ్యవస్థ ఉందా అని ఆమె ప్రశ్నించారు.
తాను క్రీడా మంత్రినీ అని, కాల్చింది రబ్బర్ బుల్లెట్ అని మంత్రి చెప్పడం సిగ్గుచేటని ఆమె మండిపడ్డారు. అయితే తన వెంట ఉన్న భద్రతా సిబ్బంది వాడుతుంది రబ్బర్ బుల్లేటా అని అరుణ ఎద్దేవా చేసారు. తెలంగాణ లో తెరాస నాయకుల ఆగడాలు తారా స్థాయికి చేరాయని, వారిని నియంత్రించాల్సిన పోలీసులు భజన చేస్తున్నారని అరుణ ఆరోపించారు. మంత్రికి అడుగులకు మడుగులు ఒత్తుతూ పోలీస్ సిబ్బంది మంత్రినీ సమర్దిస్తూ పోలీస్ శాఖను కించపర్చుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.