‘చివరి రోజు వరకు ప్రతి ఓటు కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉంటా’ అంటూబ్రిటన్లో కన్సర్వేటివ్ పార్టీ నేత పదవికి తద్వారా దేశ ప్రధానిగా ఎన్నికయ్యేందుకుపోరాడుతున్న భారత సంతతికి చెందిన రిషి సునాక్ ట్వీట్ చేస్తూ మాంచెస్టర్ ప్రచార వీడియోను విడుదల చేయడం ద్వారా సరికొత్త తరహా ప్రచారంకు తెరదించారు.
అధికార కన్జర్వేటివ్ పార్టీ నేత ఎన్నికకు మరో రెండు వారాల గడువే ఉండటం, ప్రధాన ప్రత్యర్థి లిజ్ ట్రస్ కంటే వెనుకబడి ఉన్న నేపథ్యంలో రిషి సునాక్ వర్గం వ్యూహం మార్చిన్నట్లు కనిపిస్తున్నది. తుది వరకూ పోరాటమే తన నైజం అని ప్రకటించారు.
అందులో “అండర్ డాగ్‌తో జాగ్రత్త అంటున్నారు. ఎందుకంటే ఓటమి అంచున ఉన్న వాళ్లు పోగొట్టుకునేదేమీ ఉండదు. ఉన్న ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటారు. వారు కష్టపడి పని చేస్తారు, ఎక్కువ సేపు ఉంటారు, తెలివిగా ఆలోచిస్తారు. అండర్ డాగ్‌లు అవకాశాన్ని వదులుకోరు. కష్టపడి పని చేస్తూ.. ఎప్పుడూ ఆత్మసంతృప్తి చెందరు’’ అని ఆ వీడియోలో వాయస్ ఓవర్ వినిపిస్తుంటుంది.
సెప్టెంబర్ 5వ తేదీన ఎంపిలు ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని తమ నేతగా ఎన్నుకోవడం ద్వారా బ్రిటన్‌కు తదుపరి ప్రధానిని ఖరారు చేస్తారు. కీలక ఎన్నిక ప్రక్రియకు రెండు వారాల ముందు సునాక్ బృందం సునాక్ పోరును తెలిపే ఈ వీడియోను వెలువరించింది. తాను చివరి తేదీ చివరి ఓటు వరకూ పోరుసల్పుతూనే ఉంటానని చెబుతూ 30 రోజులలో 100 సభలలో 16,000 మంది పార్టీ సభ్యులను ప్రచార దశలో కలిసినట్లు తెలిపారు.
దేశంలో జరిగిన పలు సర్వేలలో ట్రస్ విజేత అవుతారని తేల్చిచెప్పాయి. బుకీలు కూడా దీనిని నిర్థారించారు. పన్నులు తగ్గిస్తామని, ఆర్థిక సంక్షోభం నివారిస్తామని ఆమె వాగ్దానాలకు దిగుతూ వచ్చారు. అయితే దేశంలో అన్నింటి కంటే ప్రమాదకరమైనది ద్రవ్యోల్బణం అని, వాస్తవిక స్థితిలోనే ఆర్థిక సమస్యలకు పరిష్కారం దక్కాల్సి ఉంటుందని సునాక్ చేస్తున్న ప్రచార శైలికి టోరీ ఎంపిలు కొందరు మద్దతు ప్రకటిస్తున్నారు.
ట్రస్ ఆలోచనలు వాస్తవికతల నుంచి సెలవుల దిశగా ఉన్నాయని, సునాక్ మాటలు నిజాల నుంచి నిజాల వైపు సాగుతున్నాయని వారు పేర్కొంటున్నారని అబ్జర్వర్ పత్రిక తెలిపింది. దీనితో క్రమేపీ ప్రధాని పోటీ తేదీ నాటికి వాస్తవిక రూపంపై సస్పెన్స్ కొనసాగుతోంది.