తెలుగు రాష్ట్రాలలో మొదటిసారిగా ఎమ్మెల్యేపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించి ఎమ్యెల్యే రాజాసింగ్ ను గురువారం పోలీసులు అరెస్ట్ చేసి, చర్లపల్లి జైలుకు తరలించారు. ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీయాక్ట్ నమోదు అయినట్టు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. చాలాసార్లు ఒక మతాన్ని, వర్గాన్ని కించపరిచేలా రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారని ఆయన మీడియాకు తెలిపారు.
మంగళహాట్ పోలీస్ స్టేషన్లో గతంలో రాజాసింగ్‌పై రౌడీషీట్ ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఈ కేసులు ఆధారంగా చేసుకొని బీజేపీ ఎమ్మెల్యేపై పీడి యాక్ట్ నమోదు చేసినట్టు చెప్పారు.. ఎమ్మెల్యే రాజాసింగ్ పై 2004 సంవత్సరం నుండి ఇప్పటి వరకు 101 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసు వర్గాల కథనం.
రాజాసింగ్ పై నమోదైన కేసుల్లో 18 మతపరమైన కేసులే. వీటిలో కొన్ని సరైన సాక్ష్యాధారాలు లేక వీగిపోయాయి. మరికొన్నికోర్టు విచారణలో ఉన్నాయి. పాత కేసులన్నీ తిరగబెడుతూ పీడీ యాక్ట్ ప్రయోగించడంతో రాజాసింగ్ ఏడాది వరకు జైలుకే పరిమితం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
నగరంలో మునావర్ ఫారూఖీ ప్రోగ్రామ్ జరగటానికి కారణం టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలేనని అరెస్ట్ కు కొద్దిసేపు ముందు సెల్ఫీ వీడియోలో ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. తాను వీడియో రిలీజ్ చేయడానికి కారణం మునావర్ ఫారూఖీనే అని స్పష్టం చేశారు.
తాను కోర్టు ఆదేశాలు పాటించే వ్యక్తినని.. మహమ్మద్ ప్రవక్తపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. హిందూ ధర్మం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమని పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందంటే.. అందుకు కారణం ఎంఐఎం నేతలేనని రాజాసింగ్ స్పష్టం చేశారు.