ప్రపంచవ్యాప్తంగా పుట్టుకొస్తున్న కరోనా కొత్త వేరియంట్లు పలు దేశాలపై విరుచుకుపడుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ప్రజలు ఈ వేరియంట్ల బారిన పడుతూనే ఉన్నారు. దానితో ప్రస్తుతమున్న కరోనా వ్యాక్సిన్లు కొత్త వేరియంట్లపై ఎందుకు సమర్థవంతంగా పనిచేయడం లేదనే అంశంపై అమెరికా శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు.
కరోనా వేరియంట్ ఏదైనా ఒకేలా, అత్యంత సామర్థ్యంతో పనిచేసే కొత్త వ్యాక్సిన్‌ను యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజెల్స్ (యూసిఎల్ఎ) శాస్త్రవేత్తలు రూపొందించారు. కరోనా వైరస్‌పై ఉండే కొమ్ముపై కాకుండా, వైరస్ మ్యుటేషన్లకు కారణమయ్యే వైరల్ పాలిమరేస్ ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యాక్సిన్‌ను రూపొందించే కొత్త విధానాన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
కాగా, ప్రస్తుతమున్న కరోనా వ్యాక్సిన్లన్నీ కూడా వైరస్ స్పైక్ ప్రోటీన్‌తో తయారైనవే. దీంతో శరీరంలోకి వైరస్ ప్రవేశించగానే వ్యాక్సిన్లు దాన్ని గుర్తించి, రోగనిరోధక శక్తిని అప్రమత్తం చేస్తాయి. అయితే వైరస్ స్పైక్ ప్రొటీన్‌లో మార్పుల కారణంగా డెల్టా, ఒమిక్రాన్ వంటి వేరియంట్లు వచ్చాయని, ప్రస్తుతమున్న వ్యాక్సిన్లు ఈ వేరియంట్లను గుర్తించలేకపోతున్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు.
దీంతో వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారు కూడా కరోనా బారినపడుతున్నట్లు గుర్తించారు. ఈ సమస్యను అధిగమించేందుకు…కరోనా, సార్స్, మెస్, సాధారణ జలుబుకు కారణమయ్యే అన్నిరకాల వైరస్లలో అత్యంత సాధారణంగా కనిపించే ‘వైరల్ పాలిమరేస్’ను రోగనిరోధక వ్యవస్థలో ఉండే టి-కణాలతో మిళితం చేశామని పేర్కొన్నారు.
ఈ పాలిమరేస్.. స్పైక్ ప్రొటీన్ మాదిరి మార్పు చెందదని చెప్పారు. ఈ కొత్త విధానం ద్వారా అన్ని వేరియంట్లకు వ్యతిరేకంగా దీర్ఘకాల రక్షణ కల్పించే కొత్తతరహా వ్యాక్సిన్లను తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ఇలా ఉండగా, కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే దాదాపు 70కిపైగా దేశాల్లో విస్తరించిన మహమ్మారితో మళ్లీ దాదాపు లాక్డౌన్ పరిస్థితులను సృష్టిస్తోందని అంచనా వేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు జాగ్రత్తలు పాటించడం ద్వారా ఒమిక్రాన్ బారి నుంచి రక్షించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
కరోనా అసలైన వైరస్, డెల్టా వేరియంట్ కంటే 70 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు. అయినా తీవ్రమైన అనారోగ్యం బారినపడే ప్రమాదం గణనీయంగా తక్కువగానే ఉన్నట్లు గుర్తించారు. అధ్యయనంలో శాస్త్రవేత్తలు కొత్త వేరియంట్ మానవ శరీరంలోని ఏ భాగాలను ఎక్కువ ప్రభావం చేస్తుందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.