గ్రామాల్లో పని చేస్తున్న వ్యవసాయ విస్తరణాధికారుల (ఎఇఒ) పదోన్నతులపై వ్యాజ్యాల్లో కోర్టు ధిక్కరణకు పాల్పడ్డ వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఆ శాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్‌లను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. ఈ నోటీసులు వ్యవసాయ శాఖలో కలకలం రేపుతున్నాయి.
జనవరి 7 ఉదయం పదిన్నరకు న్యాయస్థానానికి రావాలని, అప్పటి నుండి ఈ కేసు తేలేంత వరకు ప్రతి రోజూ తమ ఎదుట హాజరు కావాలని కోర్టు ధిక్కరణ నోటీసులిచ్చింది. అధికారులకు నోటీసులు అందించేలా చర్యలు చేపట్టాలని గుంటూరు జిల్లా కోర్టును ఆదేశించింది. ధిక్కరణ నోటీసులపై న్యాయస్థానం ఈ నెల 3న ఆదేశాలివ్వగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.
ఇదిలా ఉండగా పదోన్నతులపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు అర్హులైన తమకు అన్యాయం జరిగిందని కోర్టును ఆశ్రయించిన ఎఇఒ ముద్దపప్పు వేణుగోపాల్ కేసు ఉపసంహరించుకోవాలని ఉన్నతాధికారులు తీవ్ర స్థాయిలో మానసికంగా వేధిస్తున్నారని సమాచారం. అధికారుల తీరుతో తాను ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదనకు గురైనట్లు బాధితుడు తెలిపారు.
అగ్రికల్చర్లో ఎఇఒలు, ఆ పైన ఉద్యోగుల రిక్రూట్మెంట్కు, ప్రమోషన్లకు భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసిఎఆర్) గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో చదివి ఉండాలన్న నిబంధన ఉంది. కాలక్రమంలో నాన్-ఐసిఎఆర్ అభ్యర్ధులు సైతం ఉద్యోగాలు సంపాదించారు. ఈ వ్యవహారంలో కోర్టు కేసులూ ఉన్నాయి.
కాగా వన్ టైం సెటిలిమెంట్ కింద 15 మంది నాన్-ఐసిఎఆర్ ఎఇఒలకు వ్యవసాయ అధికారులుగా (ఎఒ) పదోన్నతులు కల్పించేందుకు నిరుడు సెప్టెంబర్ 23న వ్యవసాయశాఖ మెమో ఇచ్చింది. నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ కొందరు ఎఇఒలు కోర్టునాశ్రయించగా ప్రమోషన్ల ప్రక్రియ నిలిపేయాలని గతేడాది డిసెంబర్ 5న కోర్టు ఉత్తర్వులిచ్చింది.
కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా పాత తేదీలు వేసి ప్రమోషన్ ఆర్డర్స్ ఇవ్వగా డిసెంబర్ 7న సదరు ఉద్యోగులు విధుల్లో చేరారు. అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ ఇద్దరు ఐసిఎఆర్ ఎఇఒలు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, ఉన్నతాధికారులైన పూనం మాలకొండయ్య, అరుణ్‌కుమార్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ, వారిని వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది.