పెగాసస్ స్నూపింగ్ కేసులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ దర్యాప్తును సుప్రీంకోర్టు శుక్రవారం నిలిపేసింది. స్వతంత్ర కమిటీ చేత దర్యాప్తునకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఓ దర్యాప్తు కమిషన్‌ను ఏర్పాటు చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది.
నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ (ఎన్జీవో) గ్లోబల్ విలేజ్ ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు ఇచ్చింది. ఇజ్రాయెలీ స్పైవేర్ పెగాసస్‌ను ఉపయోగించి అనేక మంది ప్రముఖులపై చట్టవిరుద్ధంగా నిఘా పెట్టినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ ఆరోపణలపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు అక్టోబరులో ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. వ్యక్తులపై విచక్షణారహితంగా నిఘా పెట్టడం ఆమోదించదగినది కాదని తెలిపింది. అయితే ఈ ఆరోపణలపై దర్యాప్తు కోసం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంబీ లోకూర్ నేతృత్వంలో ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.
గ్లోబల్ విలేజ్ ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించాలని కోరుతూ ఈ కమిషన్‌కు సుప్రీంకోర్టు ఓ నోటీసు ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని ఉద్దేశించి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ, ‘‘ఏమిటిది? మేం ఏమీ చేయడం లేదని గతంలో మీరు చెప్పారు. ఇప్పుడు కార్యకలాపాలు ప్రారంభించారు’’అంటూ నిలదీశారు.
దీనికి సింఘ్వి బదులిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిషన్‌ను నియంత్రించదని తాను చెప్పానని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకు ఏమీ చేయవద్దని కమిషన్‌కు తెలియజేశామని చెప్పారు. ఈ కోర్టు తీర్పు చెప్పే వరకు ఈ కమిషన్ ఏమీ చేయబోదని తెలిపారు.
పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించిన సుమారు 300 మంది ప్రముఖులపై నిఘా పెట్టినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ గతంలో వెల్లడించింది. నిఘాకు గురైనవారిలో ఇద్దరు మంత్రులు, 40 మందికిపైగా పాత్రికేయులు, ముగ్గురు ప్రతిపక్ష నేతలు, ఓ సిటింగ్ జడ్జి కూడా ఉన్నట్లు తెలిపింది.
దీంతో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డాయి. భారతీయులపై నిఘా పెట్టడం కోసం పెగాసస్‌ను ఉపయోగించారా? అని నిలదీశాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ అంశంపై పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి.