ఆర్థిక నేరస్థుడు సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఉన్న రూ. 200 కోట్ల దోపిడీ కేసులో బాలీవుడ్ నటి నోరా ఫతేహీని ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు. ఢిల్లీ పోలీస్ ఆర్థిక నేరాల విభాగం ఆమెను నాలుగు రంటలపాటు విచారించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో గతంలోనూ ఫతేహీ విచారణ ఎదుర్కొన్నారు.
మరో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తోపాటు నోరా ఫతేహీకి కూడా సుకేశ్ ఖరీదైన బహుమతులు వచ్చినట్టు ఈడీ విచారణలో తేలింది. దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గతంలో సుకేశ్, నోరాను ముఖాముఖి కూర్చోబెట్టి విచారించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఈడీ తమ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.
అయితే 2020 డిసెంబర్ 12 కి ముందు తాను సుకేశ్‌తో మాట్లాడలేదని నోరా ఫతేహీ దర్యాప్తు అధికారులకు తెలిపింది. కానీ సుకేశ్ మాత్రం తాను నటితో మాట్లాడినట్టు చెప్పడం గమనార్హం. నోరాకు సుకేశ్ ఓ లగ్జరీ బీఎండబ్లు కారును బహుమతిగా ఇచ్చినట్టు ఈడీ గుర్తించింది. అయితే ఈ కారును తాను తిరిగిచ్చేసినట్టు నటి విచారణ సమయంలో చెప్పింది.
రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్‌సింగ్, శిబిందర్సింగ్లకు బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి ఏకంగా రూ. 200 కోట్లు సుకేశ్ చంద్రశేఖర్ వసూలు చేశాడు. తర్వాత బెయిల్ విషయాన్ని దాటివేస్తుండటంతో శిబిందర్ సింగ్ భార్య అదితి సింగ్ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి 2021లో సుకేశ్‌ను అరెస్టు చేశారు.
ఈ ఆర్థిక మోసం కేసులో అనేక మంది బాలీవుడ్ తారలు, మోడల్స్ కూడా చిక్కుకున్నారు. ప్రస్తుతం వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కొంత మందికి సమన్లు కూడా అందజేశారు. సుకేశ్‌కు పలువురు బాలీవుడ్ నటీనటులతో సన్నిహిత సంబంధాలున్నాయని విచారణలో తేలింది.
నటి జాక్వెలిన్‌కు సుకేశ్ దాదాపు రూ. 10 కోట్ల విలువైన ఖరీదైన బహుమతులు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఈ కేసులో ఆమెను కూడా నిందితురాలిగా పేర్కొంటూ ఈడీ ఇటీవల అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఈ 26న విచారణకు రావాలంటూ ఇటీవల ఢిల్లీ పోలీసులు జాక్వెలిన్‌కు సమన్లు జారీ చేశారు.