2022 సెప్టెంబర్ 17న ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’గా పాటించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.
సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేబినెట్ సమావేశం నిర్ణయించింది. రాజరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలోకి అడుగుపెట్టి ఈ నెల 17వ తేదీ నాటికి 75 సంవత్సరాల్లోకి అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలోనే ఘనంగా వజ్రోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించుకుంది.
మంత్రివర్గ నిర్ణయాలు
* సెప్టెంబర్ 16న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో విద్యార్థులు, యువతీ యువకులు, మహిళలతో భారీ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయం
* సెప్టెంబర్ 17న సీఎం కేసీఆర్ పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జెండా ఆవిష్కరించి, ప్రసంగించనున్నారు. అదే రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు.. మున్సిపాలిటీ, పంచాయతీ కేంద్రాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు జాతీయ జెండాలను ఆవిష్కరించనున్నారు.
* సెప్టెంబర్ 17న మధ్యాహ్నం బంజారా ఆదివాసీ భవన్ ప్రారంభోత్సవం ఉంటుంది. నెక్లెస్ రోడ్డు నుంచి అంబేడ్కర్ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకూ భారీ ఊరేగింపు నిర్వహించాలని నిర్ణయం. అనంతరం అక్కడే బహిరంగ సభ నిర్వహించాలని కేబినెట్ లో నిర్ణయించారు. ఈ సభకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు.
* సెప్టెంబర్ 18న అన్ని జిల్లా కేంద్రాల్లో స్వాతంత్ర్య సమరయోధులకు సన్మానాలు చేయాలని నిర్ణయం. కవులు, కళాకారులను గుర్తించి సత్కరించనున్నారు. తెలంగాణ స్ఫూర్తిని ఘనంగా చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు.
విద్యాసాగరరావు హర్షం
తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను తెలంగాణ సర్కారు అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు హర్షం ప్రకటించారు. తెలంగాణలో భూమి కోసం, భుక్తి కోసం అనేక పోరాటాలు జరిగాయని ఆయన గుర్తు చేశారు.
‘సెప్టెంబర్ 17 నిర్వహించాలంటే అన్ని పార్టీల వారు గతంలో నవ్వేవారు. తాజా పరిణామాలు నాకు సంతోషాన్ని ఇచ్చాయి. చారిత్రక గ్రామాలు గుర్తించాలి. షోయాబుల్లా ఖాన్, కొమరం భీం విగ్రహాలన్ని ప్రతిష్టించాలని అప్పట్లో పోరాడా. తురేబాజ్ ఖాన్ పేరు అసదుద్దీన్ ప్రస్తావింవటం ఆనందంగా ఉంది. షోయబుల్లా ఖాన్ విగ్రహన్ని కూడా ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలి. తెలంగాణలో ప్రజాసమస్యలపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మహారాష్ట్ర, కర్ణాటకల్లో కూడా విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తున్నారు. ’’ అని తెలిపారు.