వివాహాన్ని చట్టబద్ధత కల్పించేందుకు ఆర్యసమాజ్ సంస్థలు ఇచ్చే సర్టిఫికేట్ ఒక్కటే సరిపోదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. వివాహాన్ని తప్పనిసరిగా రిజిస్టర్ చేయించాల్సిందేనని పేర్కొంది.
వివిధ ఆర్యసమాజ్ సంస్థలు జారీ చేసిన వివాహ ధృవీకరణ పత్రాలను ఈ కోర్టుతో పాటు ఇతర హైకోర్టులు వేర్వేరు విచారణల సమయంలో తీవ్రంగా ప్రశ్నించాయని హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణలో భాగంగా జస్టిస్ సౌరభ్ శ్యామ్ సమాశ్రయ్ పేర్కొన్నారు.
ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నా దాన్ని రిజిస్టర్ చేయకపోతే గుర్తించలేమని పేర్కొన్నారు. పత్రాల వాస్తవికతను పరిగణనలోకి తీసుకోకుండా ఆ సంస్థ వివాహాలను జరిపించడం వారి నమ్మకాలను దుర్వినియోగం చేయడమేనని స్పష్టం చేశారు.
భోలా సింగ్ అనే వ్యక్తి ఈ హెబియస్ కార్పస్ పిటిషన్‌ను దాఖలు చేశారు. అయితే తన భార్య మేజర్ అని, వివాహం చేసుకున్నప్పటికీ తనపై ఫిర్యాదు చేశారని, భార్యను అక్రమంగా నిర్భందించారంటూ భోలాసింగ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. వారు వివాహం చేసుకున్నారని నిరూపించేందుకు ఘజియాబాద్‌లోని ఆర్యసమాజ్ మందిర్ జారీ చేసిన వివాహ పత్రాన్ని పిటిషనర్ల తరపు న్యాయవాది సమర్పించారు.
అయితే ఆ వివాహాన్ని చట్టబద్ధంగా నమోదు చేయకపోవడంతో కేవలం ఆర్యసమాజ్ సర్టిఫికేట్‌తో వారు వివాహం చేసుకున్నట్లు భావించలేమని కోర్టు పేర్కొంది. దర్యాప్తు కొనసాగుతున్నందున ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు గత నెల 31న కోర్టు తిరస్కరించింది.