బ్రిటన్ కొత్త ప్రధాని లిజ్ ట్రస్ మంత్రివర్గంలో భారత సంతతికి చెందిన ఇద్దరికి స్థానం లభించింది. ఇప్పటివరకు అటార్నీ జనరల్‌గా వున్న సుయెల్లా బ్రావర్మన్ (47) కొత్తగా మంత్రివర్గంలోకి అడుగిడి, హోం మంత్రి అయ్యారు. ఇదివరకు బోరిస్ జాన్సన్ మంత్రివర్గంలో సహితం ఇద్దరు భారత సంతతికి చెందినవారు ఉండేవారు. రిషి సునాక్ (ఆర్ధికం), ప్రీతి పాటిల్ (హోమ్) కీలక శాఖలను నిర్వహించేవారు.
భారత సంతతికి చెందిన అలోక్ శర్మ (55) వాతావరణ కార్యాచరణ మంత్రిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. తమిళ, గోవా వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న బ్రావర్మన్ లండన్‌లో జన్మించారు. బారిస్టర్ చదివారు. ఆగేయ ఇంగ్లండ్‌లోని ఫరేహమ్ ఎంపిగా ఉన్నారు. అందరూ ఉహించినట్లుగానే ప్రధాని పదవికి పోటీపడిన భారత సంతతికి చెందిన రిషి సునాక్ కు మంత్రివర్గంలో చోటు దక్కక పోవడమే కాక, ఆయన మద్దతుదారులుకు సహితం చాలావరకు దక్కలేదు.
బోరిస్ జాన్సన్ వారసురాలిగా ట్రస్ ఎన్నికవగానే హోం మంత్రి ప్రీతి పటేల్ రాజీనామా చేశారు. ఆ బాధ్యతలను సుయెల్లా బ్రావర్మన్ చేపడుతున్నారు. దేశంలో నేరాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతుండగా, ప్రాసిక్యూషన్ జరిగే నిష్పత్తి చాలా తక్కువగా వున్న సమయంలో వాటిపై దృష్టి సారించాల్సిన అవసరం కూడా ఉంది.
ఆగ్రాలో జన్మించిన అలోక్ శర్మ 2010లో పార్లమెంట్‌కు ఎన్నికైనప్పటి నుంచి వ్యాపార, వాణిజ్యం, గృహ నిర్మాణం, ఉపాధి కల్పన వంటి మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తూ వచ్చారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన కార్పొరేట్ రంగంలో పనిచేశారు.తొలిసారి బ్రిటన్ మంత్రివర్గంలో కీలక శాఖలు అన్ని మైనారిటీలకు దక్కాయి. బ్రిటన్ లోని ముఖ్యమైన నాలుగు అత్యున్నత స్థానాల్లోనూ బ్రిటన్యేతరులను ఎంపిక చేయడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. 1960లో ఘనా నుండి వచ్చి బ్రిటన్‌లో స్థిరపడిన కుటుంబానికి చెందిన క్వాసీ క్వార్టెంగ్ను ఆర్థిక మంత్రిగా నియమించారు.
విదేశాంగ మంత్రిగా మరో నల్ల జాతీయుడైన జేమ్స్ క్లీవర్లీని ఎంపిక చేశారు. క్లీవర్లీ తల్లి సియెర్రా లియోనుకు చెందిన వ్యక్తి కాగా, తండ్రి బ్రిటన్‌కు చెందిన వారు. విభిన్న జాతులకు చెందిన పిల్లవాడిగా వేధింపులకు గురయ్యానని, అలాగే నల్ల జాతి ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీ మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని గతంలో క్లీవరీ పేర్కొన్నారు. దశాబ్దాల క్రితం వరకు శ్వేత జాతీయుల నిండిపోయిన బ్రిటన్ క్యాబినెట్లో మొదటి సారిగా 2002లో నల్ల జాతీయుడైన పౌల్ బోటెంగ్ను మైనారిటీ మంత్రిగా నియమించడం గమనార్హం.