పశ్చిమ మధ్య బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని, ఈ అల్పపీడనం మరింత బలపడి తీవ్రంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. కర్ణాటక, దక్షిణ తెలంగాణ, ఉత్తర కోస్తా మీదుగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఒక ద్రోణిగా కొనసాగుతోందని దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ, తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ సూచించింది.
హైదరాబాద్‌లో నాలుగు రోజుల నుంచి జోరుగా వానలు కురుస్తుండడంతో లోతట్టు ప్రజల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాగల మూడు రోజులు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం రాజేంద్రనగర్, శంషాబాద్, గండిపేట, అత్తాపూర్, బండ్లగూడ, మెహిదీపట్నం, ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. అలాగే కార్వాన్, లంగర్‌హౌస్, గోల్కొండ, మల్లేపల్లి , హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రహదారుల పైకి నీరు రావడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి: భద్రాద్రి కొత్తగూడెం 218 మిల్లీమీటర్లు, కరీంనగర్లో 148, మహబూబాబాద్‌లో 125, జగిత్యాలలో 115, నారాయణపేటలో 99, సంగారెడ్డిలో 92, రంగారెడ్డిలో 90, నిజామాబాద్‌లో 89, రాజన్న సిరిసిల్లలో 80, మేడ్చల్ మల్కాజిగిరిలో 52, హైదరాబాద్‌లో 42 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.
కోస్రాంధలో పలుచోట్ల శుక్రవారం భారీ వర్షాలు పడ్డాయి. రాయలసీమలో తేలికపాటి జల్లులు కురిశాయి. కాకినాడ జిల్లా ఉప్పాడలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం తీరంలో సముద్రం 50 మీటర్ల వరకూ ముందుకు వచ్చింది.
ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండడంతో కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారడంతో రాగల 36 గంటల్లో ఉత్తరాంధ్ర పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం డ్యూటీ అధికారి హైమారావు తెలిపారు.
ఇలా ఉండగా, తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతోంది. ఇప్పటివరకూ 10 గేట్ల ద్వారా నీటిని దిగవకు విడదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుతం డ్యామ్‌లో 1632.25 అడుగుల మేర నీరు ఉంది. ఇన్ ఫ్లో 57,431 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 34,762 క్యూ సెక్కులుగా ఉంది.
డ్యామ్ నీటి నిల్వ పూర్తి స్థాయి సామర్ధ్యం 105.788 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ సామర్ధ్యం 102.777 టీఎంసీలుగా ఉందని అధికారులు ప్రకటించారు. ఎగువన కురుస్తున్న వర్గాలతో ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతోందని, ఇరిగేషన్ తో పాటు ప్రాజెక్టు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని అధికారులు తెలిపారు.