గ్రేటర్ హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం రంగరంగ వైభవంగా, ప్రశాంతంగా ముగిసింది. ఆగస్టు 31న ప్రారంభమైన గణేష్ ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి. సుమారు 6 లక్షలకు పైగా విగ్రహాలను ప్రతిష్టించారు. నిమజ్జనాన్ని చూడ్డానికి లక్షలాది మంది తరలివచ్చారు. ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు,ఎన్టీఆర్ మార్గ్ ప్రాం తాల్లో ఇసుకెేస్తే రాలనంతగా జనం కిక్కిరిసిపోయారు.
దీంతోపాటు లడ్డు వేలంలో ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ లడ్డు అత్యధికంగా రూ 24.60 లక్షల రేటు పలికింది. ఈసారి గచ్చిబౌలిలోని మైహోం భుజాలో సైతం లడ్డూ భారీ స్థాయిలో ధర పలికింది. తెలంగాణ వ్యాప్తంగా వినాయక చవితి, నిమజ్జనం ఒకెత్తయితే ఖైరతాబాద్ పంచముఖ మహాలక్ష్మి గణపతి మరో ఎత్తు. ఈసారి 50 అడుగుల్లో మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా రాత్రి 7 గంటలకే నిమజ్జనాన్ని పూర్తి చేశారు.
గ్రేటర్‌వాసులు, తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చిన అశేష జనవాహిని నడుమ పంచముఖ మహాలక్ష్మి గణపతికి వీడ్కోలు పలికారు. మధ్యాహ్నం 12.12గంటలకు మండపం నుంచి బయటకు తీసిన ఖైరతాబాద్ గణపతి శోభయాత్రం 6గంటలకుపైగా సాగింది. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు జనంతో కిక్కిరిసిపోయాయి. మహా గణపతి నిమజ్జన ప్రక్రియను వీక్షించేందుకు సందర్శకులు భారీగా తరలివచ్చారు.
నగరంలో గణనాథుల నిమజ్జన యాత్రకు వేలాదిగా భక్తులు తరలివచ్చి శోభయాత్రను కనులారా వీక్షించారు. మొత్తం 10,470 మంది సిబ్బంది నిమజ్జన ప్రక్రియలో నిమగ్నం కాగా హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో 12 కిలోమీటర్ల మేర డబుల్ లేయర్ భారీగేటతోపాటు నిరంతర పర్యవేక్షణకు కంట్రోల్ రూం, వాచ్టవర్లను ఏర్పాటు చేశారు.
అంతేకాకుండా నిమజ్జనంలో భాగంగా ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా జిహెచ్ఎంసి ఎంటమాలజీ సిబ్బంది అన్ని ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైట్‌ను పిచికారీ చేశారు. అలాగే జలమండలి అధికారులు భక్తులకు తాగు నీటి సౌకర్యం కల్పించారు.
కాగా, ఎంజె మార్కెట్ వద్ద అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ పాల్గొన్న బహిరంగసభలో ఉద్రిక్తత నెలకొంది. శర్మ మాట్లాడుతున్న సమయంలో టీఆర్ఎస్ కార్యకర్త నందుబిలాల్ సమీపం దాకా వచ్చి సీఎంపైకి మైక్ విరిచేశాడు. దైవ కార్యక్రమానికి వచ్చి రాజకీయాలు మాట్లాడటం, కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడటంపై శర్మను ఉద్దేశించి కార్యకర్త ఆగ్రహం వ్యక్తం చేస్తూ దూషణకు దిగాడు.
దాంతో అప్రమత్తమైన భాగ్యనగర్ ఉత్సవ్ సమితి నాయకులు వెంటనే టీఆర్ఎస్ కార్యకర్తను స్టేజీపై నుంచి కిందకు దించేశారు. పోలీసులు అతన్ని అక్కడ నుంచి తరలించారు. అంతకు ముందు హిమంత బిశ్వశర్మ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ..తెలంగాణలో ప్రభుత్వం నిజాం పాలనని కొనసాగిస్తోందని ఆరోపించారు.
తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని, కుటుంబ పాలన నుంచి విముక్తి కలగాలని భాగ్యలక్ష్మీ అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు. త్వరలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.
బాలాపూర్ గణేశుడి లడ్డు మరోసారి రికార్డు ధర పలికింది. పోటాపోటీగా సాగిన వేలంపాటలో రూ 24.60 లక్షలకు బాలాపూర్ ఉత్సవ సమితి సభ్యులు వంగేటి లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు. గతేడాది కడప జిల్లా ఎమ్మెల్సీ రమేశ్యాదవ్తో కలసి నాదర్గుల్వాసి మర్రి శశాంక్‌రెడ్డి లడ్డును రూ.18.90 లక్షలకు దక్కించుకున్నారు.
దీంతోపాటు ఈసారి గచ్చిబౌలిలో మైహోం భుజాలో లడ్డు వేలంలో రూ.20.50లక్షల ధర పలికింది. బడంగ్పేట్ లడ్డు రూ.12లక్షలు, కర్మన్‌ఘట్‌లో మాధవరం సెరినిటిలో రూ.11.11లక్షలు, కూకట్‌పల్లిలో రూ.3.90లక్షలు, చంపాపేట్‌లో రూ.2.50లక్షలు పలికాయి.