అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఉద్యమం ప్రారంభమై వెయ్యి రోజులు అవుతోన్న సందర్భంగా ఈ నెల 12నుంచి అమరావతి నుంచి అరసవల్లి వరకు రైతులు చేపట్టిన పాదయాత్రకు సన్నాహాలు పూర్తయ్యాయి. శాంతిభద్రతల కారణాలతో అనుమతి ఇచ్చేందుకు డీజీపీ నిరాకరించినా హైకోర్టు అనుమతి ఇవ్వడంతో యాత్రకు అడ్డులేక పోయింది.
హైకోర్టు అనుమతినివ్వడంతో ఉత్సాహంగా ఉన్న రైతులు పాదయాత్ర ప్రారంభానికి ముహూర్తం సిద్ధం చేశారు. ఈ నెల 12న వేకువ జామున 5 గంటలకు ముందుగా వెంకటపాలెంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి యాత్రను ప్రారంభిస్తారు. ప్రత్యేకంగా సిద్ధం చేసిన శ్రీవారి రథాన్ని ఆరు గంటలకు వెంకటపాలెం గ్రామానికి తీసుకొస్తారు. 9 గంటలకు రథానికి జెండా ఊపి లాంఛనంగా యాత్రను ప్రారంభిస్తారు.
ఈ కార్యక్రమానికి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తప్ప మిగతా పార్టీలను ఆహ్వానించారు. అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతు జేఏసీ సమన్వయ కమిటీ సభ్యులను ఆహ్వానించారు. టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఎం, సీపీఐ, ఆప్, కాంగ్రెస్ వంటి పార్టీలన్నీ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి.
యాత్ర తొలి రోజు వెంకటపాలెం నుంచి కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం మీదుగా మంగళగిరికి చేరుకుంటుంది. రాత్రికి అక్కడే బస చేస్తారు. కాగా, హైకోర్టు తీర్పు నేపథ్యంలో పాదయాత్రలో పాల్గొనే వారి వివరాలను అమరావతి పరిరక్షణ సమితి నేతలు డీజీపీ కార్యాలయంలో అందజేశారు.
మరోవంక, అమరావతి మునిసిపాలిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జిఓ విడుదల చేయడం, ఈ విషయమై పది రోజులలో ఆయా గ్రామస్థుల అభిప్రాయం సేకరణ జరపాలని నిర్ణయించడం కేవలం పాదయాత్రను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఎత్తుగడగా రైతులు విమర్శలు గుప్పిస్తున్నారు. తాము లేని సమయంలో గ్రామసభలు నిర్వహించి, మునిసిపాలిటీకి ప్రజలు ఆమోదం తెలిపారని విధంగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నారు.
అయితే, పాదయాత్ర కొనసాగిస్తూనే గ్రామసభలలో మున్సిపాలిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానాలు చేసే విధంగా చూడాలని రైతులు నిర్ణయించారు. రాజధాని అమరావతిని 22 గ్రామాలతో పురపాలక సంఘంగా ఏర్పాటు చేయడంపై ప్రజాభిప్రాయ సేకరణకు ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది.
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని 16 ల్యాండ్ పూలింగ్ గ్రామాలతో పాటు నాన్పూలింగ్ గ్రామాలైన పెదపరిమి, హరిశ్చంద్రాపురం, వడ్డమానుల్లో సోమవారం (12వ తేదీ) నుంచి 19 తేదీ వరకు గ్రామ సభలు జరుగుతాయని ప్రకటించారు.