కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో వేగంగా వ్యాపిస్తోంది. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 101కి చేరిందని వైద్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు ఈ వేరియంట్ 11 రాష్ట్రాలకు విస్తరించగా మొత్తంగా 101 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.
అత్యధికంగా మహారాష్ట్రలో 32, ఢిల్లీలో 20 కేసులు బయటపడినట్లు తెలిపింది. రాజస్తాన్‌లో 17, కర్ణాటకలో 8, తెలంగాణలో 8, గుజరాత్లో 5, కేరళలో 5 కేసులు వెలుగుచూశాయి. ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.
అనవసర ప్రయాణాలను ఆపేయాలని, సామూహిక సమావేశాలను రద్దు చేసుకోవాలని, పండుగలను తక్కువ స్థాయిలో సెలబ్రేట్ చేసుకోవాలని ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ బల్రామ్ భార్గవ తెలిపారు.
ఐరోపాలో భారీ స్థాయిలో ఈ కేసులు పెరుగుతున్నాయని, అక్కడ మహమ్మారి కొత్త దశ నడుస్తోందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పౌల్ తెలిపారు. ప్రతి శ్యాంపిల్కు జీనోమ్ సీక్వెన్సింగ్ సాధ్యం కాదు అని డాక్టర్ పౌల్ చెప్పారు. అయితే వ్యూహాత్మక రీతిలో శ్యాంపిళ్లను పరిశీలిస్తున్నామని చెప్పారు.
కరోనా వేరియంట్‌తో సంబంధం లేకుండా కేసులు పెరగడంతో 19 జిల్లాలు అత్యధిక ప్రమాదంలో ఉన్నాయని, దీంతో అప్రమత్తత అవసరమని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రపంచంలోని మొత్తం కరోనా కేసుల్లో వేగంగా వ్యాపిస్తున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే 2.4 శాతం వాటా కలిగి ఉందని హెచ్చరించింది.
మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలతో పాటు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేపట్టవద్దని, సమావేశాలు, పెద్ద సమూహాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది.
ఒమిక్రాన్ వేరియంట్‌ను 91 దేశాల్లో గుర్తించినట్లు లవ్ అగర్వాల్ తెలిపారు. డెల్టా కన్నా వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్నట్లు డబ్ల్యూహెచ్‌వో చెప్పిందని పేర్కొన్నారు. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌లో డెల్టాను ఒమిక్రాన్ దాటి వేస్తుందని ఆయన తెలిపారు.