బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాడైజ్ మనీ ల్యాండరింగ్ కేసులో పోలీసుల విచారణకు హాజరయింది. మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టయిన సుఖేశ్ చంద్రశేఖర్‌తో స్నేహం, అతడి నుంచి ఖరీదైన బహుమతులను అందుకుంది.
ఈ కేసులో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఢిల్లీ పోలీసు శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం రెండు రోజుల క్రితం జాక్వెలిన్‌కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులకు అనుగుణంగానే జాక్వెలిన్ బుధవారం ఢిల్లీలోని ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ కార్యాలయానికి చేరుకున్నారు.
విచారణలో భాగంగా జాక్వెలిన్‌కు సంధించాల్సిన ప్రశ్నావళిని ముందుగానే సిద్ధం చేసిన ఢిల్లీ పోలీసులు ఆమెను రాత్రి 8 గంటల దాకా విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా గురువారం, శుక్రవారం కూడా జాక్వెలిన్‌ను పోలీసులు విచారించనున్నారు.
ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని పోలీసులు జాక్వెలిన్‌కు సూచించారు. ఈ విచారణకు జాక్వెలిన్‌తో పాటు ఆమెను సుఖేశ్‌కు పరిచయం చేసిన పింకీ ఇరానీ కూడా హాజరయ్యారు.