నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును పెట్టాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌కు సీఎం ఆదేశాలు జారీచేశారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ‘తెలంగాణ సెక్రటేరియట్ )కు అంబేద్కర్ పేరును నామకరణం చేయడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమని చెప్పారు. ఈ నిర్ణయం భారతదేశానికే ఆదర్శం అంటూ భారత ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేద్కర్ తాత్వికతను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతోందని తెలిపారు.
అంబేద్కర్ కలలుగన్న భారతదేశంలో భిన్నత్వంతో కూడిన ప్రత్యేక ప్రజాస్వామిక లక్షణం ఉందని అంటూ ఫెడరల్ స్ఫూర్తిని అమలు చేయడం ద్వారా మాత్రమే అన్ని వర్గాలకు సమాన హక్కులు అవకాశాలు కల్పించబడుతాయనే అంబేద్కర్ స్ఫూర్తి తమను నడిపిస్తోందని పేర్కొన్నారు.
భారతదేశ గౌరవం మరింతగా ఇనుమడించబడాలంటే భారత నూతన పార్లమెంట్ కుకూడా అంబేద్కర్ పేరును మించిన పేరు లేదనే విషయాన్ని ఇటీవలే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించామని గుర్తు చేశారు. అందుకు సంబంధించిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించిందని చెబుతూ ఇదే విషయమై నేను ప్రధాని మోదీకి త్వరలో స్వయంగా లేఖ పంపుతానని తెలిపారు.