ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో భారత్కు తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు భారత్లోని వైద్య కళాశాల్లో ప్రవేశాలు కల్పించలేమని కేంద్రం స్పష్టం చేసింది. ఇలాంటి సడలింపులను అనుమతిస్తే దేశంలో వైద్య విద్య ప్రమాణాలకు విఘాతం కలుగుతోందని పేర్కొంది. అయితే ఉక్రెయిన్ కళాశాలల అనుమతితో మరో దేశంలో వైద్య విద్య పూర్తి చేయడానికి అవకాశం కల్పిస్తామని తెలిపింది. ఈ మేరకు గురువారం సుప్రీంకోర్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.
ఉక్రెయిన్ నుంచి వచ్చిన భారతీయ విద్యార్థులకు ఉపశమనం కలిగించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాంశు ధూలియాలతో కూడిన ధర్మాసనం విచారించింది.
కేంద్రం తరపు న్యాయవాది అఫిడవిట్ దాఖలు చేయడానికి సోమవారం వరకూ గడువు ఇవ్వాలని కోరగా ధర్మాసనం నిరాకరించింది. హిజాబ్ కేసు విచారించాల్సి ఉందని శుక్రవారమే ఉక్రెయిన్ విద్యార్థుల కేసు విచారిస్తామని స్పష్టం చేసింది. దీంతో గురువారమే కేంద్రం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.
జాతీయ వైద్య కమిషన్ చట్టంలో ఇలాంటి మినహాయింపులకు సంబంధించి నిబంధనలేవీ లేవని, అందువల్ల దేశంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశాలు సాధ్యం కాదని పేర్కొంది. నీట్లో తక్కువ మార్కులు రావడం, ఆర్థిక స్థోమత వంటి రెండు కారణాలతో వారంతా ఉక్రెయిన్ వెళ్లారని తెలిపింది.
అయితే బాధిత విద్యార్థులకు సహాయం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని నివేదించింది. నీట్లో మెరిట్ తక్కువగా ఉన్న ఈ విద్యార్థులకు దేశంలో ప్రవేశాలు కల్పిస్తే ఆయా కళాశాలల్లో సీట్లు పొందలేకపోయిన అభ్యర్థుల నుంచి అనేక వ్యాజ్యాలు కోర్టుకు వస్తాయని పేర్కొంది.
ఉక్రెయిన్లో రష్యా సైనిక ఆపరేషన్ నేపథ్యంలో కోర్సును పూర్తి చేయలేని విద్యార్థుల నిమిత్తం ఈ నెల 6న నేషనల్ మెడికల్ కమిషన్ జారీ చేసిన పబ్లిక్ నోటీసుతో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ఆ నోటీసు ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు భారతీయ కళాశాలల్లో దొడ్డిదారి ప్రవేశాలు (బ్యాక్ డోర్ ఎంట్రీ)గా భావించరాదని పేర్కొంది.
కాగా, అకడమిక్ మొబిలిటీ పోగ్రామ్ కింద ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులు ఏయే దేశాల్లోని యూనివర్శిటీల్లో వైద్య విద్య పూర్తి చేయొచ్చో జాబితాను గురువారం నేషనల్ మెడికల్ కమిషన్ విడుదల చేసింది.
పోలండ్, చెక్ రిపబ్లిక్, ఫ్రాన్స్, జార్జియా, కజకిస్తాన్, లుథియానా, మోల్డోవా, స్లోవేకియా, స్పెయిన్, ఉజ్బెకిస్తాన్, అమెరికా, ఇటలీ, బెల్జియం, ఈజిప్టు, బెలారస్, లాత్వియా, కిర్గిస్తాన్, గ్రీస్ , రొమేనియా, స్వీడన్, ఇజ్రాయెల్, ఇరాన్, అజర్బైజాన్, బల్గేరియా, జర్మనీ, టర్కీ, క్రొయేషియా, హంగేరీల్లో వైద్య విద్య పూర్తి చేయొచ్చని తెలిపింది.