కృష్ణంరాజు మరణం చిత్ర పరిశ్రమకు తీరనిలోటు అని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఘనంగా నివాళులు అర్పించారు.
క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో నిర్వహించిన ఈ సంతాప సభలో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ 1998లో తాను కృష్ణంరాజును తొలిసారి కలిశానని, అప్పుడాయన పార్లమెంటు సభ్యులుగా ఎన్నికై ఢిల్లీకి వచ్చారని చెప్పారు.
వాజ్ పేయి మంత్రి వర్గంలో ఉన్నప్పుడు ఆయనకు చాలా దగ్గరయ్యానని అంటూ కృష్ణంరాజుతనకు ఆత్మీయ మిత్రుడు అని చెప్పారు. ఢిల్లీలో ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా మాట్లాడేవారు అని రాజ్ నాథ్ అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కొన్ని నెలల క్రితం ఢిల్లీలో కృష్ణంరాజును కలిసేందుకు వెళ్లినప్పుడు అనారోగ్యంతో ఉన్నట్లు అనిపించలేదని తెలిపారు.
“చాలా బాగా నాతో మాట్లాడారు. కృష్ణంరాజు ఇక లేరనే ఆకస్మిక వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. దాన్ని నేను చాలాసేపటి వరకు నమ్మలేకపోయాను’’ అని తెలిపారు. కృష్ణంరాజు పెద్ద స్టార్ అయినా తనను అన్నగారు అని పిలిచేవారని,. వివాదాలకు ఎప్పుడు దూరంగా ఉండేవారని పేర్కొన్నారు.
కృష్ణంరాజు 55 ఏళ్ల సినీ కెరీర్ లో ఎన్నో మంచి సినిమాలు చేశారని చెబుతూ బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ని, కృష్ణంరాజు ని ప్రత్యేకంగా అభినందించానని చెప్పారు. గోహత్య నిషేధంపై పార్లమెంట్లో తొలిసారిగా బిల్లు ప్రవేశ పెట్టింది కృష్ణంరాజు అనే విషయాన్ని రాజ్ నాథ్ సింగ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణంరాజు కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో తాను బిజెపి యువజన నాయకుడిగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అప్పుడు ప్రతిరోజు కలిసే వాళ్ళమని గుర్తుచేసుకున్నారు. భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొంటానని కృష్ణంరాజు కోరినట్లు తెలిపారు. అందరూ అభిమానించే వ్యక్తి కృష్ణంరాజు అని.. మనసులో కల్మషం లేని వ్యక్తి అని కొనియాడారు.
రాబోయే ఎన్నికలలో దేశంలోని పలు రాష్ట్రాలలో బిజెపి ప్రచారంలో పాల్గొంటానని తనతో చెప్పారని తెలిపారు. అంతకు ముందు రాజ్ నాథ్ జూబ్లీహిల్స్ లోని కృష్ణం రాజు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కృష్ణంరాజుతో మంచి అనుబంధం ఉందని పేర్కొంటూ మర్యాదకు కృష్ణంరాజు మారుపేరని తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. కృష్ణంరాజు మంచితనం ప్రబాస్ కు వచ్చిందని ఆయన చెప్పారు. ఫిల్మ్ నగర్ లో కృష్ణంరాజు విగ్రహం ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
