భారత దేశాన్ని ప్రపంచంలోనే ‘తయారీ హబ్’ గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని, ఆ దిశగా మంచి పురోగతి సాధిస్తున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కరోనా వైరస్, ఉక్రెయిన్–రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆహార, ఇంధన సంక్షోభాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఉజ్బెకిస్థాన్ లో జరుగుతోన్న షాంఘై సహకార సంస్థ (ఎస్ సివో) సదస్సులో మోదీ ప్రసంగిస్తూ ఆహార, ఇంధన సరఫరాలో ఆటంకాలను తొలగించి, మెరుగైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉందని సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రాంతీయ కూటమి దేశాలు పరస్పరం సహకరించుకోవాలని సూచించారు.
ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలవడం సంతోషకరమని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఎస్‌సివో సదస్సుకు భారత్ అధ్యక్షత వహించడానికి చైనా ఈ సందర్భంగా పూర్తి మద్దతు ప్రకటించింది.
వచ్చే ఏడాది షాంఘై సహకార సదస్సుకు ఆతిథ్యమివ్వనున్న భారత్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ శుభాకాంక్షలు తెలిపారు. భారత్ నిర్వహించనున్న సదస్సుకు చైనా సహకారం అందిస్తుందని అన్నారు. ఉజ్బెకిస్థాన్‌లోని చారిత్రాత్మక నగరమైన సమర్కండ్లో నిర్వహిస్తున్న సదస్సులో ప్రధానిమోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ లు ముఖాముఖీ కలుసుకున్నారు. 2020లో లఢఖ్‌లో ఇరు దేశాల సైనిక బలగాల ఉపసంహరణ ప్రారంభమైన అనంతరం ఇరు దేశాధినేతలు ఎదురు పడటం ఇదే మొదటిసారి.
యుద్ధం ఆపమని పుతిన్ కు సూచన
ప్రస్తుతం యుద్ధం జరిపే కాలం కాదని, వెంటనే యుద్ధం ఆపేందుకు శాంతిచర్చలు ప్రారంభించాలని ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సూచించారు. షాంఘై సహకార సంఘం సదస్సులో భాగంగా శుక్రవారం పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపిన సందర్భంగా ఉక్రెయిన్‌తో సంక్షోభాన్ని వీలయినంత త్వరగా ఆపి వేయాలని ఆయన పుతిన్‌ను కోరారు.
యుద్ధ సమయంలో ఉక్రెయిన్‌లో చిక్కుపడిన భారత విద్యార్థులను సురక్షితంగా తరలించేందుకు సహకరించినందుకు పుతిన్‌కు మోడీ ధన్యవాదాలు కూడా తెలిపారు. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా ఇరువురు నేతలు ఆహారం, ఇంధన భద్రత, ఎరువులు సహా పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు.
యుద్ధం ఆపాలన్న మోదీ సూచనపై పుతిన్ సానుకూలంగా స్పందిస్తూ తాము కూడా సాధ్యమైనంత త్వరగా యుద్ధాన్ని ఆపాలని అనుకొంటున్నామని, సంక్షోభానికి వీలయినంత త్వరగా తెరదించాలనుకుంటున్నామని తెలిపారు. సంక్షోభ వేళ భారత్ ఆందోళనను తాము అర్థం చేసుకోగలమని చెప్పారు. ఈ సందర్భంగా మోదీకి పుతిన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సెప్టెంబర్ 17 ప్రధాని మోదీ పుట్టిన రోజు కావడం గమనార్హం.