త్వరలో ఐడిబిఐ బ్యాంక్ ప్రైవేటుపరం కానుంది. ఇందుకు అనుగుణంగా ప్రాథమిక బిడ్ల ఆహ్వాన ప్రక్రియ ప్రారంభించేందుకు డిపార్టమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (డిఐపిఎఎం) నిర్ణయించింది.
ఈ మేరకు ఐడిబిఐ బ్యాంక్‌లో తన వాటాను విక్రయించడానికి ప్రభుత్వం ఆసక్తి గల వారి అభిప్రాయాలను తీసుకుంటుందని, త్వరలో ఐడిబిఐ బ్యాంక్ ప్రైవేటీకరణ కోసం పెట్టుబడిదారుల నుండి ప్రాథమిక బిడ్లను ఆహ్వానిస్తామని డిఐపిఎఎం కార్యదర్శి తుహిన్ కాంత పాండే ఇటీవలి ఒక సమావేశంలో తెలిపారు.
ఐడిబిఐలో వాటాను విక్రయించడానికి ప్రభుత్వం 2016 బడ్జెట్లో ప్రకటించింది. ఐడిబిఐ బ్యాంక్ మే 2017 నుండి మార్చి 2021 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ (పిఎసి) ఫ్రేమ్‌వర్క్ కింద ఉంది.
బ్యాంక్ ఫ్రేమ్‌వర్క్ నుండి నిష్క్రమించిన రెండు నెలల తరువాత మే 2021లో ఐడిబిఐ బ్యాంక్‌లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ, నిర్వహణ నియంత్రణ బదిలీకి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ప్రస్తుతం, ఐడిబిఐలో ప్రభుత్వం 45.48 శాతం కలిగి ఉంది.
ప్రస్తుతం బ్యాంక్ ప్రమోటర్‌గా ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) 49.24 శాతం వాటాను కలిగి ఉంది. ప్రారంభ బిడ్లను కోరే ముందు ప్రభుత్వం, ఎల్ఐసితో పాటు ఐడిబిఐ బ్యాంక్‌లో విక్రయించే వాటా పరిమాణాన్ని నిర్ణయిస్తుంది.