తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు విషయం ఇప్పుడు సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో శాసనసభ నియోజకవర్గాల పెంపుపై కేంద్ర ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ నియోజక వర్గాలను పెంచాలని, కానీ, ఇంత వరకూ ఆ ప్రక్రియను మొదలు పెట్టలేదంటూ పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె.పురుషోత్తమ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
ఏపీలోని 175 అసెంబ్లీ సీట్లను 225కి, తెలంగాణలోని 119 సీట్లను 153కి పెంచాలని రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 26లో ఉందని, కానీ, ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ప్రక్రియను మొదలు పెట్టలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది రావు రంజిత్ వివరించారు.
జమ్ము కశ్మీర్ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న నిబంధన మేరకు అక్కడ నియోజక వర్గాలను పెంచడానికి డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేసిందని, అదే నిబంధన ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నా కేంద్రం తగిన చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు.
జమ్ము కశ్మీర్లో అసెంబ్లీ సీట్లను పెంచుతున్నప్పుడు ఏపీ, తెలంగాణల్లో ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. ఇది రాజ్యాంగంలోని 14, 19, 21వ అధికరణలను ఉల్లంఘించడమేనని. ఇది వివక్ష ప్రదర్శించడమేనని స్పష్టం చేశారు. దీంతో తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ సీట్లను 153కు, ఆంధ్రప్రదేశ్‌లోని 175 స్థానాలను 225కు పెంచేలా అవకాశం కల్పించాలని సుప్రీంను కోరారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2014లో పేర్కొన్న నిబంధనలను అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోర్టును కోరారు.
పిటిషన్లో తెలంగాణ, ఏపీ, కేంద్రం, ఈసీని ప్రతివాదులుగా చేరారు. ఈ మేరకు విచారణ జరిపిన జస్టిస్ జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్ ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. జమ్మూకశ్మీర్ నియోజకవర్గాల పిటిషన్‌కు జత చేయాలని ధర్మాసనం రిజిస్ట్రీని ఆదేశించింది. కేంద్రం, ఈసీ, ఏపీ, తెలంగాణను ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు. ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.