ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన, యువతను ఆకట్టుకొని వారికి శిక్షణ ఇవ్వడం చేస్తున్నట్లు వెల్లడి కావడంతో పిఎఫ్ఐ లక్ష్యంగా దేశవ్యాప్తంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహిస్తుంది. 10 రాష్ట్రాల్లో ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.
కేరళ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో గురువారం తెల్లవారుజాము నుంచి దాడులు నిర్వహిస్తున్నది. ఎన్ఐఏ, ఈడీ అధికారులు సంయుక్తంగా ఏకకాలంలో 40కిపైగా ప్రాంతాల్లో ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో వివిధ నేరాలతో సంబంధాలున్న 100 మంది పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.
200 మందికిపైగా ఎన్ఐఏ అధికారులు దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ కార్యాలయాలు, పలువురు కార్యకర్తల ఇండ్లలో సోదాలు జరుపుతున్నారు. రెండురోజుల క్రితం నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో దాడులు నిర్వహించిన ఎన్ఐఏ తాజాగా హైదరాబాద్, కరీంనగర్లో సోదాలు చేపట్టింది. హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలోని పీఎఫ్ఐ కార్యాలయాన్ని అధికారులు సీజ్ చేశారు.
గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచి సోదాలు నిర్వహించిన అధికారులు హార్డ్ డిస్క్, పెన్‌డ్రైవ్, కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణకు హాజరుకావాలని నిర్వాహకులకు నోటీసులు జారీచేశారు. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తుండగా, తెలంగాణలో హైదరాబాద్, అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌లలో సోదాలు జరుగుతున్నాయి.
కరీంనగర్ లోనే ఏకంగా 8 చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఉత్తర్‌ప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడులలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పీఎఫ్ఐ, ఎస్డీపీఐ కార్యాలయాలు దాని అనుబంధ సంస్థలలలో ఎన్ఐఏ బృందాలు తెల్లవారు జామునుండి సోదాలు చేస్తున్నారు. ఎస్ డి పి ఐ నేతలు అబ్దుల్ వారిస్, ఇంతియాజ్ ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ వంద మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.