ఇస్లామిక్ సంస్థ అయిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పిలుపునిచ్చిన హర్తాళ్ హింసాత్మక సంఘటనలకు దారితీయడంతో కేరళలో ఉద్రిక్తంగా మారింది. తిరువనంతపురం, కొల్లాం, కొజికోడ్, వయనాడ్, అలప్పుజ జిల్లాలు సహా పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు నెలకొన్నాయి.
ఆందోళన కారులు బస్సులపై రాళ్లు రువ్వారు. ఉదయం వార్తాపత్రికలను తీసుకెళ్తున్న ఓ వాహనంపై పెట్రోల్ బాంబుతో దాడి చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. అలప్పుజలో బస్సులతో పాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. 15 ఏళ్ల బాలిక, ఆటోడ్రైవర్కి తీవ్రగాయాలైనట్లు కేరళ పోలీసులు తెలిపారు. పోలీసులకు కూడా గాయాలైనట్లు వివరించారు.
పిఎఫ్ఐ ధర్నాను కేరళ హైకోర్టు సుమోటుగా స్వీకరించింది. పిఎఫ్ఐ మెరుపు సమ్మెను కేరళ హైకోర్టు ఖండించింది. సమ్మె కారణంగా అసౌకర్యం కలగకుండా ఉండేందుకు గాను ఏడు రోజుల ముందుగా నోటీసు ఇవ్వాలన్న 2019 నాటి ఉత్తర్వులను పిఎఫ్ఐ ఉల్లంఘించిందని కోర్టు మండిపడింది.
పిఎఫ్ఐ సమ్మె పిలుపు కోర్టు ధిక్కరణేనని జస్టిస్ ఎ.కె. జయశంకరణ్ నంబియార్, జస్టిస్ మొహమ్మద్ నియాస్లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ఆమోదయోగ్యం కాదని, కోర్టు తీర్పును ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
హింసను ఆపేందుకు సాధ్యమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించింది. పిఎఫ్ఐ సంస్థపై కర్ణాటక ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. ఆ సంస్థపై నిషేధం విధించే ప్రక్రియను ప్రారంభించినట్లు కర్ణాటక మంత్రి ఒకరు చెప్పారు. ఎన్ఐఎ జరిపిన సోదాలు ఇప్పటివరకు జరిగిన వాటిలో ఇదే అతిపెద్ద దర్యాప్తు ప్రక్రియ అని అధికారులు పేర్కొనడంతో పిఎఫ్ఐపై కేంద్రం నిషేధం విధించవచ్చని వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి.
విదేశాల నుంచి నిధులు అందుకొని, దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతోందన్న అభియోగాలపై ఎన్ఐఏ, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలతో కలిసి గురువారం దేశవ్యాప్తంగా పిఎఫ్ఐ కార్యాలయాలపై ఆకస్మిక దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. 100కి పైగా నేతలను అదుపులోకి తీసుకున్నారు.