ఇరాన్ దేశంలో హిజాబ్‌పై వివాదం రాజుకున్న నేపథ్యంలో ఓ మహిళా జర్నలిస్టు సాక్షాత్తూ ఇరాన్ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీకి షాక్ ఇచ్చారు. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీలో ప్రసంగించేందుకు ఇబ్రహీం రైసీ న్యూయార్క్ నగరానికి వచ్చారు.ఈ సందర్భంగా యూఎస్ ఇరానీయన్ అయిన సీఎన్ఎన్ చీఫ్ ఇంటర్నేషనల్ యాంకర్ క్రిస్టియానా అమన్‌పూర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ఇరాన్ అధ్యక్షుడు రైసీ అంగీకరించారు.
అయితే ఇంటర్వ్యూకు ముందు జుట్టును హిజాబ్‌తో కప్పి ఉంచుకోవాలని ఇరాన్ అధ్యక్షుడి సహాయకురాలు క్రిస్టియానాకు ఆదేశించింది. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న పరిస్థితుల కారణంగా.. హెడ్‌స్కార్ఫ్ ధరించని మహిళతో ఇంటర్వ్యూ చేయలేమని రైసి ప్రతినిధి చెప్పినట్లు అమన్‌పోర్ వెల్లడించారు.
దీంతో తాను హిజాబ్ ధరించను అని జర్నలిస్ట్ క్రిస్టియానా స్పష్టం చేసింది.హిజాబ్ ధరించకుంటే ఇంటర్వ్యూ జరగదని అధ్యక్షుడి సహాయరాలు స్పష్టం చేశారు. హిజాబ్ ధరించనని జర్నలిస్ట్ చెప్పడంతో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం ఇంటర్వ్యూ ఇవ్వకుండానే వెళ్లిపోయారు.దీంతో జర్నలిస్ట్ క్రిస్టియానా ట్వీట్లతో పాటు, ఇరాన్ ప్రెసిడెంట్ రైసీ ఇంటర్వ్యూ కోసం ఉంచిన ఖాళీ కుర్చీ ముందు హిజాబ్ లేకుండా కూర్చున్న తన చిత్రాన్ని పోస్ట్ చేసింది.
‘‘నన్ను హిజాబ్ ధరించాలని కోరితే దాన్ని మర్యాదగా తిరస్కరించాను. మేం న్యూయార్క్‌లో ఉన్నాం, ఇక్కడ హిజాబ్ కు సంబంధించి ఎలాంటి చట్టం లేదా సంప్రదాయం లేదు’’ అని బ్రిటిష్-ఇరానియన్ జర్నలిస్ట్ ట్విట్టర్లో రాశారు.
మిన్నంటిన నిరసనలు … 50 మంది మృతి
మరోవంక, ఇరాన్లో హిజాబ్ ధారణకు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. హిజాబ్ ధరించనందుకు మహసా అమిని అనే యువతి ఆ దేశ నైతిక పోలీసుల దాడిలో గత శనివారం మరణించింది. దీంతో గత వారం రోజులుగా ఇరాన్ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే నిరసనలను అణచివేసేందుకు ఇరాన్ భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నాయి.
ఈ అణచివేతలో ఇప్పటి వరకు 50 మందికి పైగా మరణించినట్లు ఓస్లో కేంద్రంగా పని చేస్తున్న ఎన్జీవో సంస్థ తెలిపింది. ఇరాన్ ప్రజలు తమ ప్రాథమిక హక్కులు, మానవ గౌరవం కోసం వీధుల్లోకి వచ్చారని ఇరాన్ మానవ హక్కుల (ఐహెచ్ఆర్) డైరెక్టర్ మహమూద్ అమిరీ-మొగద్దమ్ తెలిపారు. అయితే శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై ప్రభుత్వం బుల్లెట్లతో ప్రతిస్పందిస్తోందని ఆయన విమర్శించారు. 80కి పైగా నగరాలు, పట్టణాల్లో ప్రజా నిరసనలు కొనసాగుతున్నాయని చెప్పారు.
మరోవైపు హిజాబ్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో ఇరాన్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతున్నది. నిరసనలను అణచివేయడంతోపాటు ఇంటర్నెట్పై ఆంక్షలు విధించింది. తాజాగా ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌ను కూడా బ్లాక్ చేసింది. ఇప్పటికే ఇరాన్లో ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్, యూట్యూబ్, టిక్‌టాక్‌లను బ్లాక్ చేశారు.