కాలానుగుణ మార్పులతో రచయిత పాత్ర, కర్తవ్యం, కార్యాచరణ లక్ష్యాలుగా ఐదో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించనున్నారు. విజయవాడలోని పీబీ సిద్ధార్థ కళాశాలలో ఈ ఏడాది డిసెంబర్ 23,24 తేదీల్లో ప్రపంచ తెలుగు రచయితల మహా సభలు నిర్వహించనున్నట్లు మహా సభల గౌరవాధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్, అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవీ పూర్ణచంద్ తెలిపారు.
కృష్ణాజిల్లా రచయితల సంఘం సహకారంతో ప్రపంచ తెలుగు రచయితల సంఘం నిర్వహించనున్న ఈ మహా సభల్లో తెలుగు భాష, సంస్కృతి, చరిత్ర, సామాజిక రంగాలకు సంబంధించిన వివిధ అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నట్లు తెలిపారు. ఈ మహాసభల్లో ప్రతిభా పాటవాలతో రాణిస్తున్న సాహితీ మూర్తలు పాల్గొనాలని వారు కోరారు.
రెండు రోజుల పాటు జరిగే సభలకు రచయితలు, సాహిత్య అభిమానులు అక్టోబర్ 31వ తేదీలోగా 93912 38390 నంబర్‌కు ఆన్లైన్ ద్వారా రూ.500 ప్రతినిధి రుసుము చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని వారు కోరారు. ప్రతినిధులకు భోజన, ఉపాహారాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
ప్రతినిధులకు మాత్రమే సదస్సులు, కవి సమ్మేళనాల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు. సమయానుకూలతను బట్టి సభా వేదికపై ప్రతినిధులు తమ రచనలు ఆవిష్కరించుకునే అవకాశం ఉంటుందని వారు పేర్కొన్నారు.
2007, 2011, 2015, 2019లో రచయితల ప్రపంచ మహాసభలు స్ఫూర్తిదాయకంగా జరిగినట్లు వారు పేర్కొన్నారు. భాషా సాంస్కృతిక, సామాజిక విలువలు పతనం అంచున నడుస్తున్న తరుణంలో రచయితలను సమాయత్తం చేసేందుకు ఈ మహాసభలు ఉపకరిస్తాయని వారా ప్రకటనలో తెలిపారు.