మరో 6 నుంచి 10 నెలల్లోగా పార్లమెంటు ముందుకు నూతన టెలికాం బిల్లు రానుంది. ఈ బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం డ్రాఫ్ట్ బిల్లును కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ విడుదల చేశారు. అయితే, నూతన టెలికాం బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం తొందరపడడం లేదని ఆయన స్పష్టం చేశారు.
ప్రజాభిప్రాయ సేకరణ, విస్తృత సంప్రదింపుల తర్వాతే తుది డ్రాఫ్ట్ ను రూపొందిస్తామని తెలిపారు. తుది డ్రాఫ్ట్ ను తొలుత పార్లమెంట్ కమిటీకి పంపుతామని, ఆ తర్వాతే పార్లమెంట్లో ప్రవేశపెడతామని తెలిపారు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885, ఇండియన్ వైర్ లెస్ టెలీగ్రఫీ యాక్ట్ 1933, టెలిగ్రాఫ్ వైర్స్ (చట్టవిరుద్ధ స్వాధీనం) యాక్ట్ 1950 స్థానంలో ఈ కొత్త బిల్లును తీసుకొస్తున్నట్లు చెప్పారు.
అక్టోబరు 20 లోపు నూతన టెలికాం బిల్లుపై ప్రజాభిప్రాయం సేకరిస్తామని వెల్లడించాయిరు. ఇంటర్నెట్ ద్వారా ఆడియో కాలింగ్, వీడియో కాలింగ్, మెసేజింగ్ సేవలు అందిస్తున్న వాట్సాప్, జూమ్, గూగుల్ డ్యూయో, , ఓవర్ ది టాప్ (ఓటీటీ) సంస్థలు సైతం ఇకపై దేశీయంగా టెలికాం లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుందని ముసాయిదా బిల్లులో పొందుపరిచారు.
టెలికాం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల ఫీజులు, అపరాధ రుసుముల్ని మాఫీ చేసే నిబంధనను సైతం బిల్లులో ప్రతిపాదించారు. టెలికాం కంపెనీలు లైసెన్సులను సరెండర్ చేస్తే.. రుసుములు వెనక్కి తిరిగి ఇచ్చే ప్రతిపాదన కూడా నూతన బిల్లులో ఉంది.
కాగా, టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అధికారాలకు కత్తెర వేసేలా కొత్త టెలికం బిల్లు ఉన్నదని బ్రాండ్‌బ్యాండ్ ఇండియా ఫోరమ్ (బీఐఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. బిల్లుపై సమగ్ర సమీక్ష అవసరమని పేర్కొన్నది.
‘ప్రస్తుతం దేశంలో భారీ స్థాయిలో వృద్ధి చెందుతున్న డిజిటల్ వ్యవస్థకు సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉన్నది. కానీ, బిల్లుతో వాటికి గండి పడుతుంది’ అని పేర్కొన్నది. ట్రాయ్ అధికారాలకు కత్తెర వేసి 1997కు ముందు ఉన్న పరిస్థితులకు తీసుకెళ్లేలా బిల్లు రూపకల్పన జరిగిందని విమర్శించింది. ఇలాంటివి పెట్టుబడిదారుల విశ్వాసాన్ని, ట్రాయ్ స్వతంత్రతను దెబ్బ తీస్తాయని బీఐఎఫ్ అధ్యక్షుడు టీవీ రామచంద్రన్ విమర్శించారు.