దేశీయంగా బియ్యం ధరల పెరుగుదల కొనసాగవచ్చని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ పేర్కొంది. గత ఖరీఫ్ సీజన్‌తో పోల్చుకుంటే దేశంలో బియ్యం ఉత్పత్తి తక్కువగా ఉండొచ్చని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ రెండు రోజుల క్రితం అంచనా వేసింది. గతేడాది ఖరీఫ్ సీజన్లో బియ్యం ఉత్పత్తి 117.76 మిలియన్ టన్నులుగా ఉంటే, అది ఈ ఏడాది 104.99 మిలియన్ టన్నులుగా ఉండొచ్చని వివరించింది.
కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకటన చేసిన తర్వాత రోజే కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ నుంచి పై ప్రకటన రావటం గమనార్హం. దేశంలో బియ్యం, గోధుమలు, గోధుమ పిండి రోజువారీ సగటు రిటైల్, హోల్‌సేల్ ధరలు ఏడాది క్రితం కంటే 9 నుంచి 20 శాతం పెరిగిన రోజే కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ నుంచి ప్రకటన వచ్చింది.
వినియోగదారుల వ్యవహారాల విభాగం పోర్టల్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఏడాది క్రితం వాటి ధరలతో పోలిస్తే భారత్‌లో రోజువారీ సగటు రిటైల్ ధరలు. బియ్యం 9.03 శాతం, గోధుమలు 14.39 శాతం, గోధుమ పిండి 17.87 శాతం పెరిగాయి. ఒక ఏడాది క్రితం వాటి ధరలతో పోలిస్తే భారత్‌లో రోజువారీ సగటు హోల్‌సేల్ ధరలు.. బియ్యం 10.16 శాతం, గోధుమలు 15.43 శాతం, గోధుమ పిండి 20.65 శాతం ఎక్కువగా ఉన్నాయి.
వ్యవసాయ మంత్రిత్వ శాఖ బుధవారం 2022-23 ప్రధాన ఖరీఫ్ పంటల ఉత్పత్తికి సంబంధించిన మొదటి ముందస్తు అంచనాలను విడుదల చేసింది. ప్రస్తుత సీజన్లో ఖరీఫ్ బియ్యం ఉత్పత్తి 104.99 మిలియన్ టన్నులకు చేరుకున్నది. ఇది గత సీజన్లో నమోదైన ఉత్పత్తి 111.76 మిలియన్ టన్నుల కంటే తక్కువ.
ఖరీఫ్ వరి ఉత్పత్తి అంచనాలు ప్రస్తుత సీజన్లో నిర్దేశించబడిన 112 మిలియన్ టన్నుల లక్ష్యం కంటే తక్కువగా ఉన్నాయి. 2020-21కి గానూ 105.21 మిలియన్ టన్నుల ఉత్పత్తి నమోదైంది. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 ప్రకారం పంపిణీకి బియ్యం అవసరమయ్యే దృష్ట్యా ఖరీఫ్ బియ్యం ఉత్పత్తి గణనీయంగా తగ్గింది.
ఖరీఫ్ సీజన్ 2022లో వరి విస్తీర్ణం, ఉత్పత్తిలో ఆరు శాతం లోటు ఉండవచ్చని ఆహార మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది. ”తక్కువ ఉత్పత్తి అంచనా కారణంగా ఆరు మిలియన్ మెట్రిక్ టన్నులు (ఎంఎంటి) వరి, గతేడాది ఇదే కాలంతో పోలిస్తే బాస్మతీయేతర ఎగుమతుల్లో 11 శాతం పెరుగుదల కారణంగా ఇది పెరుగుతూనే ఉంటుంది” అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
బహిరంగ మార్కెట్లో కిలోకు రూ. 16గా ఉన్న విరిగిన బియ్యం దేశీయ ధర, రాష్ట్రాల్లో కిలోకు రూ.22కి పెరిగింది. పౌల్ట్రీ రంగం, పశుసంవర్థక రైతులు దాణా పదార్థాల ధరల పెరుగుదల కారణంగా ఎక్కువగా ప్రభావితమయ్యాయి.