రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీతోపాటు ఇతర సాగునీటి వివాదాలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ట్రిబ్యునల్ వేయాలన్న డిమాండ్‌ను మరోసారి కేంద్రం ముందు తెలంగాణ ప్రభుత్వం బలంగా వినిపించనుంది. విభజన సమస్యల పరిష్కారంలో భాగంగా బుధ, గురు, శుక్రవారాల్లో కృష్ణా జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ-2) ముందు వాదనలు జరగనున్నాయి.
కేడబ్ల్యూడీటీ-2 ముందు తెలంగాణ రాష్ట్ర వాదనలను వినిపించేందుకు ఇప్పటికే ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక బృందం ఢిల్లి వెళ్లింది రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ ఈ విషయమై జలసౌధలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. కృష్ణా జలాల పంపిణీ తో పాటు ఇతర సాగునీటి వివాదాల పరిష్కారానికి విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు, సెక్షన్ -3 ప్రకారం ట్రిబ్యునల్ వేయటమే పరిష్కారమని కేడబ్ల్యూడీటీ ముందు బలంగా వాదనలు వినిపించాలని ఆయన ఉన్నతాధికారులకు మార్గనిర్దేశనం చేసినట్లు తెలిసింది.
దక్షిణ తెలంగాణ వరప్రదాయిని అయిన పాలమూరు-రంగారెడ్డితోపాటు కృష్ణా నది బేసిన్లో ఉన్న భీమా, నెట్టెంపాడు, కొయిల్‌సాగర్, డిండి తదితర ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరగకపోవడంతో పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని, ఫలితంగా తెలంగాణలోని పలు కరువు పీడిత ప్రాంతాలు కృష్ణా బేసిన్లోనే ఉన్నా సాగు, తాగునీరు అందించడం సాధ్యంకావడం లేదన్న విషయాన్ని కేడబ్ల్యుడీటీ ముందు వినిపించాలని ఆయన అధికారులకు మార్గనిర్దేశనం చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన తర్వాత సాగునీటి వివాదాల పరిష్కారానికి, ప్రత్యేకించి కృష్ణా జలాలను ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య పంపిణీ కోసం విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు సెక్షన్-3 ప్రకారం ట్రిబ్యునల్ వేయాల్సి ఉంది. అయితే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటై ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఇంత వరకు కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయకపోవడంతో కృష్ణా నది నీటిని ఇప్పటి వరకు తాత్కాలిక పద్దతి కింద 66:34 నిష్పత్తిలోనే తెలుగు రాష్ట్రాల మధ్య పంపిణీ జరుగుతోంది.
ఫలితంగా తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, దాదాపు దక్షిణ తెలంగాణ అంతా కృష్ణా బేసిన్లోనే ఉన్నప్పటికీ, ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి తదితర జిల్లాలు తీవ్ర కరువు ప్రాంతాలుగా ఉన్నా తాత్కాలిక పద్దతిలో 34 శాతం, అంటే కేవలం దాదాపు 200 టీఎంసీలు మాత్రమే కేటాయిస్తూ వస్తుండడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలంగాణ వాదిస్తున్నది. తాత్కాలిక పద్దతి ప్రాతిపదికన కూడా 50:50 శాతం ప్రాతిపదికన 575 టీఎంసీల కృష్ణా నీటిని కేటాయించాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది.
2020 అక్టోబరు 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సుప్రీంలో పిటీషన్ వెనక్కు తీసుకుంటే ట్రిబ్యునల్ ఏర్పాటును వేగంగా పూర్తి చేస్తామని నాడు సీఎం కేసీఆర్‌కు కేంద్ర జలశక్తిశాఖ మంత్రి షెకావత్ స్వయంగా హామీ ఇచ్చారు. హామీ ఇవ్వడంతోపాటు ట్రిబ్యునల్ ఏర్పాటు అంశాన్ని రెండో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మినిట్స్ లోనూ చేర్చారు.
దాంతో కేంద్ర ప్రభుత్వ సూచనను పరిగణనలోనికి తీసుకున్న తెలంగాణ సుప్రీంకోర్టు నుంచి పిటీషన్‌ను వెనక్కు తీసుఎకుంది. పిటీషన్ వెనక్కి తీసుకుని దాదాపు 13 నెలలు గడుస్తున్నా ఇంత వరకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయకపోవడంతో ఏపీతో కృష్ణా జలాల వివాదం ఎంతకి పరిష్కారం కావడం లేదు.