ప్రముఖ హాస్యనటుడు, దివంగత నటుడు అల్లు రామలింగయ్య శత దినోత్సవం సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం హైదరాబాద్‌లో అల్లు అరవింద్ నిర్మించిన అల్లు స్టూడియోస్‌ను హైదరాబాద్ లో శనివారం ప్రారంభించారు. దాదాపు 10 ఎకరాల్లో ఏర్పాటైన ఈ స్టూడియో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
అల్లు స్టూడియో హైదరాబాద్ సిటీ అవుట్ స్కర్ట్స్‌లో ఉన్న కోకా పేట్లో భారీగా నిర్మించారు. అత్యాధునిక టెక్నాలజీతో ఈ స్టూడియోస్‌ను నిర్మించారట. కాగా ఇందులో ‘పుష్ప’ పార్ట్-2 షూటింగ్‌ను చాలా వరకు జరుపనున్నట్లు టాక్. ఇప్పటికే పుష్ప సీక్వెల్‌కు సంబంధించిన పనులు ప్రారంభమైయ్యాయట.
చిరంజీవి మాట్లాడుతూ ఎంతో మంది నటులున్నా కొద్దిమందికి మాత్రమే ఈ ఘనత, ఆప్యాయత లభిస్తుందని, రామలింగయ్యగారి వారసులుగా, కొడుకుగా వారు వేసిన బాటలో అల్లు అరవింద్ అగ్ర నిర్మాతగా, మనవలు, అల్లు బాబీ, బన్నీ, శిరీష్ వీళ్లు కూడా ఇదే సినిమారంగంలో అగ్ర స్థానంలో ఉన్నారంటే ఎన్నో దశాబ్దాల క్రితం పాలుకొల్లులో ఆయన మదిలో మెదిలిన ఆలోచన అని తెలిపారు.
ఎంతో ఇష్టమైన నటనా రంగంలో రాణించాలని మద్రాస్ వెళ్లి నిరూపించుకోవాలి అన్న బలీయమైన ఆయన ఆలోచన ఈరోజు పెద్ద వ్యవస్థగా మారిందని చెప్పారు. ఆయన ఆర్టిస్ట్‌గా నిలదొక్కుకుని ఆయన కుమారుడిని నిర్మాతను చేయాలనే తపనతో గీతా ఆర్ట్స్ ప్రారంభి వెసులుబాటు కలిగించారని గుర్తు చేశారు. తండ్రి తెలివితేటల్ని, సమయస్ఫూర్తిని పుణికిపుచ్చుకొన్న అరవింద్‌గారు నిర్మాతగా అగ్ర స్థాయిలో ఉన్నారని కొనియాడారు.
దీనికి రామలింగయ్యగారిని అల్లు వారి తరతరాలు ప్రతిక్షణం తలుచుకోవాలని చెబుతూ ఈ అల్లు స్టూడియో అనేది లాభాపేక్ష కోసం కాదని స్పష్టం చేశారు. అల్లు రామలింగయ్యగారి పట్ల కృతజ్ఞత చూపించుకోవడానికి, తరతరాలు ‘అల్లు’ అనే బ్రాండ్‌ను తలచుకోవడం కోసం ఈ స్టూడియో నిర్మించారని భావిస్తున్నాట్లు చెప్పారు.
ఇదొక స్టాటస్ సింబల్‌గా ఉండాలని పేర్కొంటూ ఇంతకంటే మనకు జన్మనిచ్చిన వారికి ఏ రకంగా కృతజ్ఞత తీర్చుకోగలం? అని ప్రశ్నించారు. తమకు ఈ బాటను ఏర్పాటు చేసిన అల్లు రామలింగయ్యగారిని స్మరించుకుంటూ ఈ ప్రయత్నం చేసిన అల్లువింద్గారు, బన్నీ, బాబీ, శిరీష్‌లకు అభినందనలు తెలిపారు. తాను కూడా ఆ కుటుంబంలో భాగమైనందుకు ఆనందిస్తున్నట్లు తెలిపారు.
‘‘నాన్నగారు చనిపోయి 18 ఏళ్లయింది. ఈ రోజు ఆయన శత జయంతి. అనేక మాధ్యమాల్లో ఇప్పటికీ ఆయన మనకు కనిపిస్తున్నారు. అల్లు స్టూడియో అనేది ఓ జ్ఞాపిక. లాభాపేక్ష కోసం కట్టింది కాదు. గీతా ఆర్ట్స్, అల్లు స్టూడియో, ఆహా ఓటిటి అన్నింటిని నా కుమారులకు అప్పగిస్తున్నాను’’ అని అరవింద్ చెప్పారు.
“అల్లు అరవింద్ పెద్ద నిర్మాత. స్థలాలు ఉన్నాయి. స్టూడియో కట్టడం పెద్ద కష్టం కాదు అని కొందరు అనుకోవచ్చు. అయితే మేం ఈ స్టూడియో డబ్బు సంపాదించడం కోసం కట్టలేదు. ఇది మా తాతయ్య కోరిక. ఆయన జ్ఞాపకార్ధం నిర్మించాం. ఈ స్టూడియో ద్వారా పరిశ్రమకు ఎన్నో సేవలు అందాలి’’ అని అల్లు అర్జున్ తెలిపారు.