ఆరు రాష్ట్రాలలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 3న ఉప ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల కమిషన్ సోమవారం ప్రకటించింది. తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ స్థానంతోపాటు బీహార్‌లోని మొకామ, గోపాల్‌గంజ్, మహారాష్ట్రలోని అంధేరి(తూర్పు), హర్యానాలోని ఆదంపూర్, ఉత్తర్ ప్రదేశ్‌లోని గోలా గోరఖ్‌నాథ్, ఒడిశలోని ధామ్‌నగర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.
అక్టోబర్ 7న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. నవంబర్ 6న వోట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల కమిషన్ తెలిపింది. సిట్టింగ్ శాసనసభ్యులు మరణించడంతో అంధేరి(తూర్పు), గోలా గోరఖ్‌నాథ్, గోపాల్‌గంజ్, ధామ్‌నగర్ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. ఒక కేసులో దోషిగా తేలిన దరిమిలా సిట్టింగ్ ఎమ్మెల్యేపై అనర్హత వేటుపడడంతో మొకామ స్థానానికి ఖాళీ ఏర్పడింది.
కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ రాజీనామా చేయడంతో ఆదంపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్నది.
కాగా, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మునుగోడు ఉపఎన్నిక తెలంగాణలోని మూడు ప్రధాన రాజకీయ పక్షాలకు ప్రతిష్టాకరంగా మారింది. వచ్చే ఏడాది ఎన్నికల ముందు ప్రజాభిప్రాయం మలచే ఎన్నికగా భావిస్తూ ఇప్పటికే ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. మునుగోడులో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
శాసన సభ్యత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసి, బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డిని తమ అభ్యర్థిగా ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. మరోవంక కాంగ్రెస్ తమ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించింది. టిఆర్ఎస్ తమ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి వైపే అధిష్టానం మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.