హైదరాబాద్ నాంపల్లిలో అలయ్‌బలయ్ కార్యక్రమాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గురువారం సందడిగా నిర్వహించారు. ఏటా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ సంస్కృతిని గుర్తు చేస్తూ కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలతో పాటు కేరళ గవర్నర్ ఆరీఫ్ మహమ్మద్ ఖాన్, కేంద్ర మంత్రి భగవంత్ కూబా, మెగాస్టార్ చిరంజీవి, గరికపాటి నరసింహారావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు, టిఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కేశవరావు, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, సిపిఐ నేత నారాయణ ప్రభూతులు హాజరయ్యారు.
అయితే అలయ్‌బలయ్‌లో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కళాకారులతో కలిసి ఆయన డప్పు వాయించారు. పోతురాజులతో కలిసి చిరు డ్యాన్స్ చేశారు. చిరంజీవికి బండారు దత్తాత్రేయ ఆదరంగా స్వాగతం పలికారు. అలయ్ బలయ్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు సందడి చేశారు. డప్పు వాయించిన వీహెచ్, పోతరాజులతో కలిసి డ్యాన్స్ చేశారు.
అలయ్ బలయ్ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. బండి సంజయ్ ను బండారు దత్తాత్రేయ ఘనంగా సన్మానించారు. అలయ్ బలయ్ నిర్వాహకులు బండారు విజయలక్ష్మీ దంపతులను బండి సంజయ్ సన్మానించారు. తెలంగాణ ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
చిరంజీవి మాట్లాడుతూ మతాలు, కులాలు, వర్గాలకు అతీతంగా అలయ్ బలయ్ నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఇలాంటి గొప్ప కార్యక్రమం విశ్వవ్యాప్తం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రేమ, సోదరాభావం అనే గొప్ప సందేశాన్ని ఇస్తున్న ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదంటూ ఒక పెద్ద హిట్ సినిమా వచ్చిన తరువాత అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.