శివసేన పార్టీ గుర్తు వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎకనాథ్ షిండే వర్గాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరిస్తూ ఓ నిర్ణయం తీసుకొనేందుకు ఎన్నికల కమీషన్ కసరత్తు చేస్తోంది. మరోవంక, ఏ వర్గానికి కేటాయించకుండా పార్టీ గుర్తును ఈసీ స్తంభింపజేస్తే అనుసరింప వలసిన మార్గాల గురించి రెండు శిబిరాలు సంసిద్దమవుతున్నట్లు తెలుస్తున్నది.
శివసేన గుర్తు తమదంటే తమదని ఇప్పటికే ఉద్ధవ్ థాకరే, ఏక్నాథ్ షిండే వర్గాలు సుప్రీంకోర్టులో సవాలు చేయడం, నిర్ణయం తీసుకోకుండా ఈసీఐని అడ్డుకోలేమని అత్యున్నత న్యాయస్థానం తీర్పుచెప్పడంతో ఈసీఐ కసరత్తు ముమ్మరం చేసింది.
తాజాగా శివసేన గుర్తును ఏక్నాథ్ షిండే వర్గం క్లెయిమ్ చేయడంతో దీనిపై సమాధానం ఇవ్వాలని ఉద్ధవ్ థాకరే వర్గాన్ని ఈసీఐ శుక్రవారంనాడు ఆదేశించింది. ఈ మేరకు ఒక లేఖ రాసింది. తగిన డాక్యుమెంట్లతో అవసరమైన సమాచారాన్ని శనివారం మధ్యాహ్నం 2 గంటల లోపు తమకు సమర్పించాలని ఉద్ధవ్ థాకరే వర్గానికి ఆ లేఖలో ఈసీఐ తెలియజేసింది.
ఉద్ధవ్ వర్గం నుంచి ఎలాంటి సమాచారం అందని పక్షంలో అందుకు అనుగుణంగా తాము తగిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని కూడా ఈసీఐ స్పష్టం చేసింది. ఈ ఏడాది జూలైలో ఏక్నాథ్ షిండే వర్గం తిరుగుబాటు చేయడంతో మహారాష్ట్రలో అధికార మహా వికాస్ అఘాడి ప్రభుత్వం కుప్పకూలింది.
షిండే వర్గం 39 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ మద్దతు తీసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో ఎమ్మెల్యేలపై పడిన అనర్హత వేటు వ్యవహారం తేల్చాలని సుప్రీంకోర్టును ఉద్ధవ్ థాకరే వర్గం ఆశ్రయించగా, సొంత పార్టీ విశ్వాసం కోల్పోయిన నేతకు ఫిరాయింపుల చట్టం ఎంత ఆయుధం కాబోదని షిండే వర్గం వాదించింది.
అసలైన శివసేన పార్టీ తమదేనని ఉద్ధవ్ థాకరే పేర్కొంటూ ఏక్నాథ్ షిండే వర్గం పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోయిందని, కాబట్టి పార్టీపైనగానీ, పార్టీ గుర్తుపైనగానీ వాళ్లకు ఎలాంటి హక్కులు ఉండవని స్పష్టంచేశారు. ఈ వివాదం కొనసాగుతుండగానే ఎమ్మెల్యే రమేశ్ లట్కే మరణంతో అంధేరీ శాసనసభ స్థానానికి ఉపఎన్నిక వచ్చింది. ఉద్ధవ్ వర్గం లట్కే సతీమణి రుతుజా లట్కేని బరిలో దించింది. షిండే వర్గం బీజేపీ అభ్యర్థి ముర్జి పటేల్‌కు మద్దతు ప్రకటించింది.
పార్టీ గుర్తుపై సైతం ఇరువర్గాలు క్లెయిమ్ చేయడంతో, దీనిపై ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఈసీని నిలువరించాలని సుప్రీంకోర్టును థాకరే వర్గం కోరింది. అయితే, ఈ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం సెప్టెంబర్ 27న తోసిపుచ్చింది. నిజమైన శివసేన ఎవరిదో తేల్చేందుకు ఈసీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
శివసేనకు 22 మంది ఎంపీల బలం ఉంది. లోక్‌సభలో 19 మంది, రాజ్యసభలో ముగ్గురు ఎంపీలు ఉన్నారు. ఈ 19 మందిలో 18 మంది మహారాష్ట్రకు, ఒకరు దాద్రా&నగర్ హవేలీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన 18 మందిలో 12 మంది షిండే వైపు మొగ్గుచూపుతుండగా, రాజ్యసభ సభ్యులు థాకరేతో ఉన్నారు.
అలాగే మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీలో 55 మంది ఎమ్మెల్యేలకు, 40 మంది ఎమ్మెల్యేలు షిండే వర్గంలో ఉండగా, 15 మంది థాకరేతో ఉన్నారు. లెజిస్లేటివ్ కౌన్సిల్లో శివసేనకు 12 మంది ఎమ్మెల్సీలు ఉండగా, మెజారిటీ సభ్యులు థాకరేతో ఉన్నారు. వెటరన్ శివసైనిక్ అంబాదాస్ డావ్నే కౌన్సిల్లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.