విద్య, వైద్యం తదితర రంగాల్లో దేశంలో అగ్రగామిగా ఉన్న కేరళ రాష్ట్రం మరో అరుదైన రికార్డును నెలకొల్పింది. బాల్య వివాహాలేవీ కేరళలో జరగలేదని తమ తాజా సర్వేలో తేలినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో బాల్య వివాహాలు అధికంగా జరిగే ప్రాంతం జార్ఖండ్ అని, మైనర్లుగా వుంటుండగానే పెళ్లిళ్లు అయిపోతున్న బాలికల శాతం ఇక్కడ 5.8గా ఉందని ఆ సర్వే పేర్కొంది.
18 ఏళ్లు రాకముందే వివాహమవుతున్న ఆడపిల్లల శాతం జాతీయ స్థాయిలో 1.9శాతంగా వుండగా, జార్ఖండ్‌లో 5.8శాతంగా నమోదైంది. అదే సమయంలో కేరళలో ఇది సన్నగా ఉందని సర్వే పేర్కొంది. రిజిస్ట్రార్ జనరల్, జనాభా లెక్కల కమిషనర్ కార్యాలయం ఈ సర్వేను నిర్వహించాయి.
జార్ఖండ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ తరహా వివాహాలు 7.3శాతంగా వుండగా, పట్టణ ప్రాంతాల్లో మూడు శాతంగా ఉన్నాయని సర్వే తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా సర్వేల్లో ఒకటిగా పేర్కొనే ఈ సర్వేలో 84 లక్షల మంది నుంచి వివరాలు సేకరించారు.
నమూనా నమోదు వ్యవస్థ (ఎస్ఆర్ఎస్) ద్వారా సేకరించిన డేటా ప్రాతిపదికన వివిధ జనాభా, సంతానోత్పత్తి, మరణాల సూచికల అంచనాలను గణాంక నివేదికలో పొందుపరిచారు. 2020లో ఈ సర్వే చేపట్టగా, గత నెల చివరిలో నివేదిక ప్రచురితమైంది.
జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 21 ఏళ్లలోపే సగానికిపైగా యువతులకు పెళ్ళిళ్లు అయిపోతున్నాయని నివేదిక పేర్కొంది. పశ్చిమ బెంగాల్లో ఈ శాతం 54.9గా ఉండగా, జార్ఖండ్‌లో 54.6గా ఉంది. అదే సమయంలో జాతీయ సగటు 29.5 శాతంగా ఉంది.