అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రుణ సంక్షోభాలు మరింత తీవ్రం కావచ్చని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. నిపుణులు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (యుఎన్‌డిపి) అభివృద్ధి చెందుతున్న దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచంలోని అత్యంత పేద దేశాలు తీవ్రమైన రుణ సంక్షోభంలో కూరుకుపోయే అవకాశం ఉందని హెచ్చరించింది.
అంచనా ప్రకారం ప్రపంచ పేదల్లో సగానికి పైగా నివసిస్తున్న 54 దేశాలకు పేదరికాన్ని ఎదుర్కొనేందుకు తక్షణమే రుణ ఉపశమనం కలిగించాలని పేర్కొంది. పర్యావరణ మార్పులను తట్టుకునేందుకు అవసరమైన సాయం అందించాలని పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్రమైన రుణ సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చని, మరింత అధ్వాన్నంగా మారేందుకు అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
శ్రీలంక, పాకిస్థాన్, చాద్, ఇథియోపియా, జాంబియాలు రుణసంక్షోభాల్లో కూరుకుపోవడంతో ఈ వారం అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంక్ వాషింగ్టన్లో సమావేశాలు నిర్వహించనున్నాయి. ఇదే సమయంలో యుఎన్‌డిపి ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం. రుణాలను రద్దు చేయడం, చాలా దేశాలకు ఉపశమనాలు అందించడం, ఆయా దేశాల బాండ్ కాంట్రాక్టులకు ప్రత్యేక క్లాజ్లు జోడించడం వంటివి ప్రయోజనకరంగా ఉండవచ్చని యుఎన్‌డిపి అడ్మిన్‌స్ట్రేటర్ అచిమ్ స్టెయినర్ సూచించారు.
సమర్థవంతమైన రుణ పునర్నిర్మాణం జరగకపోతే పేదరికం పెరుగిపోవడం, రుణ ఉపశమనానికి అవసరమైన పెట్టుబడులు రాకపోవచ్చని, వాతావరణ అననుకూలతలు పెరిగిపోతాయని స్టెయినర్ హెచ్చరించారు. జి20 దేశాల నేతృత్వంలోని కామన్ ఫ్రేమ్ వర్క్ ప్లాన్‌కు మరోసారి అవసరమైన మార్పులు చేసుకోవాలని యుఎన్‌డిపి నివేదిక పేర్కొంది.
కరోనా సమయంలో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొన్న దేశాలకు సాయం చేసేలా రుణ పునర్ వ్యవస్థీకరణ కోసం ఈ ప్లాన్‌ను తయారు చేశారు. దీనిని ఇప్పటి వరకు చాద్, ఇథియోపియా, జాంబియా మాత్రమే వినియోగించుకొన్నాయి. కామన్ ఫ్రేమ్ వర్క్ ప్లాన్‌లో మార్పులు చేపట్టడం ద్వారా భారీ రుణాలున్న దేశాలు 70 లేదా అంతకంటే ఎక్కువ పేద దేశాలు వినియోగించవచ్చని తెలిపింది.