ఉక్రెయిన్‌ని నాటో కూటమిలో చేర్చుకోవడం వల్ల మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని రష్యా అధికారి హెచ్చరించారు. రష్యన్ ఫెడరేషన్ భద్రతా మండలి డిప్యూటీ సెక్రటరీ అలెగ్జాండర్ వెనెడిక్టోవ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరడమనేది ఆ దేశాధ్యక్షుడి దీర్ఘకాలిక ప్రాజెక్టులోని భాగం. అమెరికా మద్దతుతో ఉక్రెయిన్ నాటోలో చేరడం వల్ల అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది’ అని ఆయన స్పష్టం చేశారు.
కాగా, ఉక్రెయిన్ ప్రాంతాల్ని చట్టవిరుద్ధంగా రష్యా స్వాధీనం చేసుకోవడంపై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యుఎన్‌జిఎ) ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి భారత్ ఓటింగ్‌కి దూరంగా ఉంది. 143 మంది సభ్యుల యుఎన్జిఎలోని ఓటింగ్‌కి దూరంగా ఉన్న 35 మంది సభ్యులలో భారత్ ఒకటి.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానానికి దూరంగా ఉన్న తర్వాత భారత్.. ఉక్రెయిన్‌లో పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం, పౌరుల మరణాలతో సహా ఘర్షణలు తీవ్రం కావడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.
తీర్మానం సందర్భం ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ మానవ వ్యయంతో ఎలాంటి పరిష్కారాన్ని చేరుకోలేమని, శత్రుత్వాలు పెరగడం ఎవరికీ ప్రయోజనం కాదని భారతదేశం స్థిరంగా వాదిస్తున్నదని పేర్కొన్నారు.దౌత్య పద్ధతిలో సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చేయాలని రుచిరా పిలుపునిచ్చారు.
ఇలా ఉండగా, రష్యా ఉక్రెయిన్‌లోని పౌర ప్రాంతాలలో క్షిపణుల వర్షం కురిపించడంతో పాటు పాశ్చాత్య అధికారులు కైవ్‌లోని ప్రభుత్వానికి సైనిక సహాయాన్ని కొనసాగించే మార్గాలను చర్చించడానికి ‘నాటో’ ప్రధాన కార్యాలయంలో సమావేశానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఇటీవలి యుద్ధంలో నాటకీయంగా దాడులు పెరగడం వెనుక రష్యన్ దళాల కొత్త కమాండర్ నియామకం, యుద్ధం మధ్య సంభావ్య సంబంధంపై ఊహాగానాలు ఉన్నాయి.
క్రెమ్లిన్ జనరల్ సెర్గీ సురోవికిన్ ను నియమించినట్లు ప్రకటించింది. సిరియాలోని రష్యన్ దళాల నాయకుడిగా సహా అనేక తీవ్రమైన, సంక్లిష్టమైన యుద్ధాలలో 55 ఏళ్ల అనుభవజ్ఞుడు, క్రూరత్వానికి పేరుగాంచిన వ్యక్తి. అతడో అరివీర భయంకరుడు. యుద్ధరంగం రికార్డుల ప్రకారం సురోవికిన్కు “భీకరుడు”, “జనరల్ ఆర్మగెడాన్” వంటి టైటిళ్లు ఉన్నట్లు ‘ఫైనాన్షియల్ టైమ్స్’ ఒక నివేదికలో పేర్కొంది.