బాధ్యతాయుతమైన పదవిలో ఉండి హింస, ఘర్షణలు చెలరేగేలా రెచ్చగొట్టడం సీఎం కేసీఆర్‌కు తగదని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హెచ్చరించారు. ‘బీజేపీ నేతలను ఉరికించండి.. కేంద్రంపై యుద్ధం చేస్తాం.. ఢిల్లీలో అగ్గిపెడతాం..’ అంటూ వ్యాఖ్యానించడం హింసను ప్రేరేపించడమేనని ఆయన స్పష్టం చేశారు.
బీజేపీ శవయాత్రలు చేయాలని, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలంటూ ఒక ముఖ్యమంత్రి చెప్పడం తాను ఎక్కడా చూడలేదని విస్మయం వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ మాటల్లో ఆ ‘మంట’ కనిపిస్తోందని కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు.
ఉద్యమంలో కూడా ఎన్నడూ బయటకు రాని కేసీఆర్, ధర్నాచౌక్‌లో ధర్నాకు రావడం, బీజేపీపై పరుష పదజాలంతో విరుచుకుపడటం.. హుజూరాబాద్ తీర్పు ప్రభావమే అని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై అబద్ధపు ప్రచారం చేస్తూ, రైతులను తప్పుదోవ పట్టిస్తున్న టీఆర్ఎస్ నాయకులనే ఉరికించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
‘ఈ సీజన్లో ఉప్పుడు బియ్యాన్ని కొంటున్నాం. వంద శాతం కొంటాం. రబీ సీజన్‌కు సంబంధించి కేంద్రం ఏ రాష్ట్రానికీ లక్ష్యం కేటాయించలేదు’ అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పంట మార్పిడి విషయంలో కేంద్రం, బీజేపీ సహకరిస్తుందని.. అంతేగానీ, రైతులను భయపెట్టవద్దని ఆయన కేసీఆర్ కు హితవు చెప్పారు.
తనకు వ్యవసాయం గురించి తెలియదని కేసీఆర్ అనడాన్ని కిషన్‌రెడ్డి తప్పుపట్టారు. ‘‘నాగలితో రెండు గంటలు దున్నేందుకు నేను రెడీ.. మీరు సిద్ధమా?’’ అని సీఎంకు సవాల్ చేశారు.
కాగా, కేసీఆర్ అవినీతి పాలనతో ప్రజలు విసిగిపోయారని, 2023లో బీజేపీదే అధికారంలోకి వచ్చి తీరుతుందని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నగర కార్యాలయంలో సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.
ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఈ సందర్భంగా కోరారు.
తెలంగాణాలో రూ 23 వేల కోట్లతో జాతీయ రహదారులు
2022లో రాష్ట్రంలో రూ.23వేల కోట్లతో 865 కి.మీ. మేర కొత్త జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే పూర్తయిన జాతీయ రహదారులకు ప్రారంభోత్సవం చేయడంతో పాటు కొత్త రహదారులకు శంకుస్థాపన చేసేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంటు సమావేశాల తర్వాత రాష్ట్ర పర్యటనకు వస్తారని చెప్పారు.
కేంద్రం నిధులతో చేపడుతున్న రీజినల్ రింగ్ రోడ్డు పూర్తయితే శాటిలైట్ టౌన్‌షి్‌పలు, కాలనీలు పట్టణాలు ఏర్పాటవుతాయని చెప్పారు. రింగ్‌రోడ్డులో భాగంగా డ్రైపోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణలో జాప్యం చేయడంతో జాతీయ రహదారులు ఆలస్యమవుతున్నాయని చెప్పారు. ఇప్పటికే చేపట్టిన 274 కి.మీ. జాతీయ రహదారులు సత్వరం పూర్తయ్యేందుకు కృషిచేస్తున్నామని, రూ.8,500 కోట్ల అంచనాతో మరో 336 కి.మీ. రహదారులకు టెండర్లు పిలిచామని కిషన్‌రెడ్డి తెలిపారు.
ఇలా ఉండగా, యునెస్కో గుర్తింపు పొందిన పోచంపల్లిలో జనవరి 25న జాతీయ పర్యాటక దినోత్సవాన్ని కేంద్రం ప్రత్యేకంగా నిర్వహించనుందని కిషన్‌రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా 75 కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. రామప్ప కేంద్రంగా ఫిబ్రవరిలో ఆలయ వాస్తు శిల్పులతో జాతీయ సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు.