బ్రిటన్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేశారు. దీనిపై ఆమె గురువారం సాయంత్రం అధికారిక ప్రకటన విడుదల చేశారు. ప్రధాని పదవి చేపట్టిన 45 రోజులకే లిజ్ ట్రస్ వైదొలుగుతున్నట్లు ప్రకటించడం బ్రిటన్ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది.
‘‘నేను దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి ఉన్నట్లు కనిపించలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నాను’’ అని లిజ్ ట్రస్ ప్రకటించారు. కాగా, సెప్టెంబరు తొలివారంలోనే ఆమె బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలను స్వీకరించారు.
‘‘దేశంలో తీవ్ర ఆర్థిక అస్థిరత, అంతర్జాతీయంగా క్లిష్ట పరిస్థితులు నెలకొన్న సమయంలో ప్రధానిగా ఎన్నికయ్యా. ఉక్రెయిన్- రష్యా యుద్ధంతో బ్రిటన్‌కు మరింత ఇబ్బందికర పరిణామాలు ఎదురయ్యాయి. పార్టీలో విశ్వాసం కోల్పోయా. ప్రధానిగా ఎన్నికయ్యే క్రమంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నాను’’ అని రాజీనామా విషయం వెల్లడి సందర్భంగా ట్రస్ పేర్కొన్నారు. కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ రేసులో భారత సంతతి రిషి సునాక్‌ను ఓడించి.. సెప్టెంబరు 5న ట్రస్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
ఈనేపథ్యంలో కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకునే ప్రక్రియ వచ్చే వారంలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రధాని లిజ్ ట్రస్ ఇటీవల ప్రకటించిన మినీ బడ్జెట్లో సామాన్య ప్రజలతో సమానంగా ధనిక వర్గాలకూ ఇంధన రాయితీ ఇవ్వడం దుమారం రేపింది. దీంతో ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడడంతో సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
లిజ్ ట్రస్‌పై ఈ నెల 24లోగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని పాలక కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 100 మంది పార్లమెంటు సభ్యులు యోచిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో తొలిసారి స్పందించిన లిజ్ ట్రస్.. ‘‘ నేను తప్పిదాలు చేశాను. అందుకు క్షమించండి’’ అని రెండు రోజుల క్రితం ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. ఈ విధంగా క్షమాపణలు కోరిన రెండు రోజుల్లోనే ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేయడం గమనార్హం.
ట్రస్ వైదొలగిన నేపథ్యంలో బ్రిటన్ ప్రధానిగా పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే, అందరిలోనూ సునాక్‌కు మెరుగైన అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రిగా గతంలో ఆయన పనితీరు, విధానాలు ప్రస్తుతం లాభించే వీలుంది. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఆలోచించడం సునాక్‌కు సానుకూలాంశం కానుంది. అయితే, మూడు నెలల కిందట ట్రస్, సునాక్‌తో పాటు ప్రధాని పదవికి పోటీపడి మూడో స్థానంలో నిలిచిన పెన్నీ మోర్డాంట్ పేరూ గట్టిగా వినిపిస్తోంది.
రెండు నెలల కిందటి వరకు బ్రిటన్ ప్రధానిగా వ్యవహరించి.. వివాదాలతో వైదొలగిన బోరిస్ జాన్సన్ పేరు కూడా తాజాగా ప్రధాని రేసులో వినిపిస్తోంది. ఈయకు ముందు పదవిలో ఉన్న థెరెస్సా మేతో పాటు ప్రస్తుత రక్షణ మంత్రి బెన్ వాలెస్ అభ్యర్థిత్వాలపైనా చర్చ సాగుతోంది. ఇటీవల ఆర్థిక మంత్రిగా నియమితులైన జెరెమీ హంట్ పేరు ప్రధాని కాబోయే వారి జాబితాలో పైకి వచ్చింది.