తొమ్మిది నెలలు అవుతున్నా ఉక్రెయిన్ పై యుద్ధంలో ఆధిపత్యం వహించలేక పోవడంతో అసహనంతో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణుబాంబు ప్రయోగంకు సిద్ధపడుతున్నట్లు కధనాలు వెలువడుతున్నాయి. ఆ విధంగా చేయడం ద్వారా నాటో, ఉక్రెయిన్‌కు భయం పుట్టించేందుకు ఎత్తుగడ వేస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.
తన బలాన్ని ప్రదర్శించేందుకు పుతిన్ నల్ల సముద్రంలో అణు బాంబును పరీక్షించే అవకాశాలున్నాయని పలు నివేదికలు చెప్తున్నాయి. తన సత్తాను నిరూపించుకొనేందుకు భూ ఉపరితలంపై గానీ, నల్ల సముద్రంలోగానీ పుతిన్ అణు బాంబు పరీక్ష చేసే అవకాశాలున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో అనుకొన్నట్టుగా రష్యా పైచేయి సాధించటం లేదు. పైగా, ఆక్రమిత ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవటానికి ఉక్రెయిన్ దళాలు వీరోచితంగా పోరాడుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాలవైపు ఆ దళాలు దూసుకొస్తున్నాయి. ఇలాంటప్పుడు పుతిన్ తీసుకోగల అసాధారణ నిర్ణయం అణుబాంబు దాడి మాత్రమే.
పుతిన్ అటువంటి దుశ్చర్యకు పాల్పడితే పెను విపత్తు తథ్యం కాగలదు. అణుబాంబు ప్రయోగించే సమయం ఆసన్నమైందని ఇప్పటికే పుతిన్ ప్రకటించారు కూడా. తాను దేనికీ వెనుకాడను అని చెప్పుకోవటానికే నల్లసముద్రంలో ఈ పరీక్షకు పుతిన్ సిద్ధమవుతున్నారని నిపుణులు చెప్తున్నారు.
రష్యా న్యూక్లియర్ బాంబును పరీక్షిస్తే 1990 అక్టోబర్ 24 తర్వాత ఇదే తొలిసారి అవుతుంది. నల్ల సముద్రంలో పుతిన్ అణు బాంబును పరీక్షిస్తే తీరప్రాంతాన్ని కలిగిన రష్యా, ఉక్రెయిన్, జార్జియా, తుర్కియే, బల్గేరియా, రొమేనియా తీవ్రంగా ప్రభావితం అవుతాయి. సముద్రంపై గానీ, సముద్రం అడుగున గానీ, నిర్మానుష్య ద్వీపంలో గానీ పుతిన్ న్యూక్లియర్ బాంబు పరీక్షలు చేసే అవకాశాలున్నాయని నిపుణులు చెప్తున్నారు.
రష్యా వద్ద ప్రపంచంలో అందరి వద్ద కన్నా అత్యధికంగా 6257 అణ్వాయుధాలున్నాయి. వాటిల్లో 1458 ప్రయోగంకు సిద్ధంగా ఉండగా, మరో 3,000కు పైగా అందుబాటులో ఉన్నాయి.