ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ఘటన మరవక ముందే మరో హెలికాప్టర్ కుప్పకూలింది. అరుణా చల్ప్రదేశ్లో ఓ మిలటరీ విమానం కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు. దీంతో అందులో ఉన్న ఐదుగురు మరణించారు. వీరిలో ఇద్దరు పైలట్లు. రోజువారి కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం కూడా ఐదుగురితో బయలుదేరిన ఈ హెలికాప్టర్ అప్పర్ సియాంగ్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో కూలిపోయింది.
హెలికాప్టర్ కూలిన ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో ఉన్న ఐదుగురి కోసం రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా గాలించవలసి వచ్చింది. ఆర్మీ నడుపుతున్న అత్యాధునిక తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ఎగువ సియాంగ్ జిల్లాలోని ట్యుటింగ్ ప్రాంతంలో కుప్పకూలిందని పేర్కొన్నారు. శుక్రవారం ఈ ఘటన జరిగిందని, సహాయక సిబ్బందిని ఘటనా స్థలికి పంపినట్లు వెల్లడించారు.
హెలికాప్టర్ క్రాష్ అయిన ప్రదేశం అత్యంత మారుమూల ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి రోడ్డు మార్గం లేకపోవడంతో రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకోవడం ఇబ్బందిగా మారింది.
వాయు మార్గాన, లేదంటే వేలాడే వంతెన గుండా నడుచుకుంటూ మాత్రమే అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. దాంతో ఏరియల్ రెస్క్యూ టీమ్స్ ఒక మిగ్-17, రెండు ధృవ్ హెలికాప్టర్లతో ప్రమాద ప్రాంతానికి వెళ్లాయి. ఇద్దరు జవాన్లు హెలికాప్టర్ కూలిన చోటుకు చేరుకుని తొలుత రెండు మృతదేహాలను గుర్తించారు.
” హెలికాప్టర్ కూలిన ప్రదేశం జిల్లా కేంద్రం సింగ్ యింగ్ నుండి 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. సరైన రహదారి సదుపాయం లేకపోవడంతో క్రాష్ సైట్ కు చేరుకునేందుకే సహాయక బృందాలకు గంటల సమయం పట్టనుంది. వారు ఆప్రదేశానికి చేరుకున్న తర్వాతే అన్ని వివరాలు తెలుస్తాయి” అని ఎగువ సియాంగ్ జిల్లా ఎస్పి వెల్లడించారు. ఇటీవల ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో పైలెట్ సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.